ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నప్పటికీ.. ఎవరికి వారు.. తమ తమ భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక ఎలా ఉంటే మనుగడ సాగుతుందో.. తమ తమ ఆంతరంగికులతో చర్చించుకుంటూ అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఏపీలో బలపడడానికి నెంబర్ టూ స్థానానికి రావాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఒక్కటే చాలామందికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అదే పార్టీని అంటిపెట్టుకుని ఉండక తప్పడంలేదు. శాసనసభ నిర్వహణలో ఫిరాయింపులను అరికట్టడం అనే అంశానికి గత ప్రభుత్వ కాలానికి, ఇప్పటికి చాలాతేడా ఉంది. గత అయిదేళ్లలో చంద్రబాబుకు కూడా పూర్తి మెజారిటీ ఉంది. కానీ.. ఆయన ప్రధాన ప్రతిపక్షం వైకాపాను బలహీన పర్చడం అనేది తన ఎజెండాగా తీసుకున్నారు. కొంత మందికి డబ్బు ప్రలోభాలు పెట్టారు, కొందరిని కేసుల పేరుతో బెదిరించారనే ఆరోపణలున్నాయి.
ఎలాగైతేనేం.. 23 మందిని తమ పార్టీలోకి చేర్చుకున్నారు. వారికి మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు. రాజ్యాంగ విలువలు, నైతికవిలువల పట్ల కూడా సమానంగా గౌరవం లేని అప్పటి స్పీకరు కోడెల శివప్రసాద్.. ఫిరాయింపు ఫిర్యాదులపై ‘రోకలి నానబెట్టిన’ సామెత చందంగా మౌనం పాటించారు. తెదేపా విచ్చలవిడివి ఫిరాయింపు పర్వాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. తమ్మినేని చాలా గట్టిగా ఉన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు- లోపల ఎంత కోరిక ఉన్నా పార్టీ మారలేరు. వేటు పడుతుందనే భయం.
కానీ.. ఓడిపోయిన వాళ్లు యథేచ్ఛగా కమలతీర్థం పుచ్చుకోవాలని ఉన్నారు. ఇప్పటికే కొందరు వెళ్లారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వంతు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పలువురు నాయకులు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకించి.. నిన్నటిదాకా తెదేపాలో కింగ్ పిన్.. సుజనాచౌదరి కూడా ఇదే పని మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆది బాటలో మరింత మంది ఓడిపోయిన నాయకులు, తెదేపాలోని సెకండ్ గ్రేడ్ నాయకులు పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల స్థాయిలోనూ కిందిస్థాయి తెదేపా కార్యకర్తలను చేర్చుకోవడంపై కూడా భాజపా సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.