కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్‌కల్యాణ్ మాదిరిగా ఆవేశంతో సీఎం జగన్ ఊగిపోలేదు. రండిరా నా కొడుకుల్లారా అని అభ్యంతరకర భాష మాట్లాడలేదు. మరోసారి తనను దూషిస్తే చెప్పుతో కొడ్తానని, జగన్ పాదరక్ష చూపలేదు. కానీ ప్రత్యర్థుల పేర్లు ఎత్తకుండా, చెప్పు చూపకుండా, బాగా చురుకు తగిలేలా దేనితోనో వీపు విమానం మోత మోగేలా కొట్టారనే ఫీలింగ్. ప్రత్యర్థులపై జగన్ పంచ్ డైలాగ్‌లు ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి.
చురకలు ఎవరికి అంటించాలో, ఎలా అంటించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాగా తెలుసు. అందుకే ఆయన జనానికి బాగా అర్థమయ్యే భాషలో, తన మార్క్ పంచ్ డైలాగ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. వాళ్లు చేసిన మంచి ఏంటో చెప్పుకోలేక, బూతులకు తెగబడ్డారని మండిపడ్డారు. ఆ బూతులు మామూలుగా లేవన్నారు. చెప్పు చూపిస్తూ, బూతులు తిడుతున్న వాళ్లని చూస్తే… ఇలాంటి వారా మన నాయకులనే బాధ కలిగిందని వాపోయారు. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడించారో మన చూశామని చురకలు అంటించారు.
అలాగే మూడు రాజధానులు వద్దు, మూడు పెళ్లిళ్లు చేసుకోండి, మేలు జరుగుతుందని చెబుతున్నాడని జగన్ సెటైర్ విసిరారు. చెప్పుతో కొడ్తానని చూపించడం ఒక ఎత్తైతే, ఆ పని జగన్ కత్తిలాంటి మాటలతో చేసి చూపించారనే భావన కలుగుతోంది. మన ఇంట్లో మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోమంటే ఆడవాళ్ల మానప్రాణాలు ఏం కావాలనే ప్రశ్నతో వీపుపై ఎవరో, దేనితోనో కొడుతున్నారనే భావన, నొప్పి, ఆవేదన…అందుకు సంబంధించిన వ్యక్తులకు కలగకుండా ఉంటాయా? ఇలా జగన్ మాట్లాడిన ప్రతిమాట ఎవరికో గుండెల్లో గుచ్చుకున్నాయి.
కానీ జగన్ ఎక్కడా పేర్లు ప్రస్తావించకుండా, తాను అనుకున్న టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్‌లో ఇది మరింత పకడ్బందీగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.