తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ల భేటీ వ్యవహారం మరీ బుగ్గలు నొక్కుకునేంత విడ్డూరమైనది అయితే కాదు. ముందే చాలా మంది ఎక్స్ పెక్ట్ చేసిందే ఇదంతా. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు పొత్తుతో పోటీ చేస్తాయనేది కూడా సర్వత్రా ఉన్న అభిప్రాయమే.
సొంతంగా పోటీ చేసేంత సీన్ పవన్ కల్యాణ్ కు లేదు. సొంతంగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇలా పరస్పరం వీరు మొదటి నుంచి అవగాహనతోనే ఉన్నారు. చంద్రబాబుతో సహవాసం విషయంలో తనెంతగా అభాసుపాలవుతున్నా పవన్ కల్యాణ్ వెనక్కు తగ్గరు. ఈ విషయంలో పవన్ ఎంతకైనా దిగజారిపోతున్నారు.
మరి నాయకుడిగా పవన్ కల్యాణ్ ఎంత తీవ్రస్థాయి విమర్శలను ఎదుర్కొంటున్నా.. రాజకీయంగా చంద్రబాబుతో సాన్నిహిత్యంతో పట్టు సంపాదించాలనే ఆరాటం మాత్రం ఎంతో కొంత ఉన్నట్టుంది. అందులో భాగంగా మొత్తం 40 సీట్ల డిమాండ్ తో ఉన్నారట జనసేన అధినేత. ఈ మేరకు ఇరు వర్గాల మధ్యనా ఈ చర్చలు కొనసాగుతున్నట్టుగా సమాచారం. జనసేన డిమాండ్ 40 సీట్లు. చంద్రబాబు ఈ విషయంలో ఇంకా కచ్చితమైన నంబర్ ఏదీ చెప్పడం లేదట.
అయితే పవన్ కల్యాణ్ పై తనది వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు నాయుడు కొంతకాలం కిందటే క్లారిటీ ఇచ్చారు. మరి వన్ సైడ్ లవర్ నుంచి అవతలి వారు గట్టిగా డిమాండ్ చేసి సాధించుకోవచ్చు. కాబట్టి.. పవన్ కల్యాణ్ తన 40 సీట్ల డిమాండ్ పట్ల గట్టిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా చంద్రబాబే వెళ్లి పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో 40 సీట్ల కేటాయింపుకు చంద్రబాబు కూడా దాదాపు సానుకూలంగానే ఉండవచ్చు.
అయితే ఒకేసారి ఇన్ని సీట్లలో జనసేనకు అవకాశం ఇచ్చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద కుదుపు బయల్దేరే అవకాశాలు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ 40 కాదు కాదు, ఆ డిమాండ్ ను 25 స్థాయికి తగ్గించినా.. అదేమీ తక్కువ కాదు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని చాలా మంది మాజీ ఎమ్మెల్యేలున్నారు. అది కూడా జనసేనకు ఉన్న అడ్వాంటేజీ ప్రధానంగా గోదావరి జిల్లాల్లో. పవన్ ఇచ్చే జాబితాలో ఆ జిల్లాల్లోని నియోజకవర్గాలే ప్రధానంగా ఉంటాయి సహజంగా. ఆ రెండు జిల్లాల బయట పవన్ కల్యాణ్ పార్టీప్రభావం చూపే నియోజకవర్గాలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు.
తమకు బలం ఉన్న సీట్లన్నింటినీ తీసుకుని.. తెలుగుదేశం పార్టీపై జనసేన అదనపు భారంగా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే పవన్ ముందు సాగిలాపడటం మినహా చంద్రబాబుకు గత్యంతరం లేదు. చంద్రబాబు ఇచ్చినన్ని పుచ్చుకుని ఆయన వ్యూహంలో పావు కావడం తప్ప పవన్ కూ ఛాయిస్ లేదు!