ఇంతోటి ఎన్నికకు అంత బిల్డప్పులా..?

ఏదైనా ఎన్నిక జరుగుతోందంటే.. పోటీచేయాల్సిన అభ్యర్థుల కంటె ముందుగా.. ఓట్లు వేయాల్సిన ఓటర్లుండాలి. ఓటర్లే లేకపోతే అసలు ఎన్నిక ఎలా ఉంటుంది? అసలు ఎలా ఊహించగలం అలాంటి ఎన్నికని? అలాంటి చిన్నెలు కాంగ్రెస్ పార్టీలో…

ఏదైనా ఎన్నిక జరుగుతోందంటే.. పోటీచేయాల్సిన అభ్యర్థుల కంటె ముందుగా.. ఓట్లు వేయాల్సిన ఓటర్లుండాలి. ఓటర్లే లేకపోతే అసలు ఎన్నిక ఎలా ఉంటుంది? అసలు ఎలా ఊహించగలం అలాంటి ఎన్నికని? అలాంటి చిన్నెలు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతాయి.

ఆ పార్టీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు ప్రకటించారు. కానీ ఓటర్ల జాబితా లేదు. నామినేషన్ వేసిన శశిథరూర్.. ఓటర్ల జాబితా ఇవ్వండి మొర్రో అని పదేపదే మొత్తుకున్నాక కేవలం పేర్లు మాత్రం ఉన్న ఓ లిస్టు ఇచ్చారట. అందులో కనీసం ఫోను నెంబర్లు కూడా లేవట. కానీ తాజా ట్విస్టు ఏంటంటే.. ఓటర్లను ఆదివారం అర్ధరాత్రి కూడా మార్చేశారు. ఓటర్లను మార్చేయడం ఏమిటి అని విస్తుపోవద్దు. ఇలాంటి చిత్రాలు కాంగ్రెసులో మాత్రమే జరుగుతాయి. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. వరంగల్ జిల్లాకు సంబంధించి.. పొన్నాల లక్ష్మయ్యతో పాటు మరొక నాయకుడికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఓటరు గుర్తింపు ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి ఓటరు కార్డులు కూడా ఇచ్చారు. తీరా సోమవారం ఓటు వేయడానికి గాంధీభవన్ కు వచ్చే సమయానికి.. ఆ రెండో నాయకుడి పేరు మార్చేసి ఆ జిల్లా నుంచి ఇంకో నాయకుడి పేరు అక్కడ ఉంది. అంటే చివరి నిమిషంలో ఓటరును మార్చారన్నమాట. దాంతో గాంధీభవన్ వద్ద నానా రచ్చా అయిపోయింది. చివరికి ఆ ఇద్దరితోనూ ఓటు వేయనివ్వకుండా చేశారు. 

ప్రపంచంలో ఇలాంటి ఎన్నిక ఎక్కడైనా ఉంటుందా? ఉండదు గాక ఉండదు! ఎన్నికలు ప్రకటించిన సమయానికి బహుశా వారివద్ద ఓటర్లెవరు అనే సమాచారం కూడా ఉన్నట్టు లేదు. ఆ తర్వాత ఎన్నిక కోసం ఓటర్లను ‘తయారు’చేసినట్టున్నారు. ఆ తయారైన ఓటర్లను కూడా చివరినిమిషంలో మారిస్తే పరువుపోతుందని కూడా ఆలోచించలేదు. 

ఇలాంటి నవ్వులపాలయ్యే ఎన్నిక గురించి కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన బిల్డప్పులు ఇచ్చుకోవడమే తమాషా. మాది ప్రజాస్వామిక పార్టీ.. ఎన్నిక ద్వారా నాయకుడిని ఎన్నుకుంటాం.. బిజెపిలో అసలు ఎప్పుడైనా ఎన్నికలు జరిగాయా? లాంటి ఓవరాక్షన్ డైలాగులు వేశారు.

వీళ్లు పేరుకు మాత్రమే ఎన్నిక నిర్వహించారు. అమ్మ దయపెట్టిన ఖర్గేను అధికారంలో కూర్చోబెట్టడానికి.. మధ్యలో ‘ఎన్నికలు’ అనే ఒక కామెడీ ఎపిసోడ్ ను నడిపించారు. ఈ మాత్రం దానికి మధ్యలో శశిథరూర్ బకరా అయ్యారు.

తమ కుటుంబ పెత్తనం గుత్తగా సాగుతున్న పార్టీ, తమ కుటుంబ నియంతృత్వం నీడల్లో మనగలుగుతున్న పార్టీకి ప్రజాస్వామిక రంగు పులమాలని మేడం అనుకున్నారు గనుక.. ఈ ఎన్నిక పెట్టినట్టుగా ఉంది తప్ప.. ఇలాంటి అవకతవక ఎన్నికలతో అభాసుపాలయ్యేదే ఎక్కువ.