సమీక్ష: రణరంగం
రేటింగ్: 2.5/5
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్, మురళి శర్మ, బ్రహ్మాజీ, అజయ్, సుదర్శన్, సిరివెన్నెల రాజా, రాజా రవీంద్ర తదితరులు
మాటలు: అర్జున్ – కార్తీక్
సంగీతం: ప్రశాంత్ పిళ్ళై
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: సుధీర్ వర్మ
విడుదల తేదీ: ఆగస్ట్ 15, 2019
గాడ్‌ఫాదర్‌ని గ్యాంగ్‌స్టర్ డ్రామాలు తీసే దర్శకులు భగవద్గీతలా ఫాలో అవుతుంటారు. గాడ్‌ఫాదర్ స్ఫూర్తితో ఇప్పటికి వచ్చిన సినిమాలు కోకొల్లలు. రామ్‌గోపాల్‌వర్మ అయితే ఒక లైబ్రరీకి సరిపడా సినిమాలని గాడ్‌ఫాదర్ ఇన్‌స్పిరేషన్‌తో తీసేసాడు. ఆ ఫార్ములా ఇప్పుడు పాతబడిపోవడంతో ఇక దానికేసి ఎవరూ చూడడం లేదు. కానీ సుధీర్‌వర్మ తను మెచ్చిన చిత్రాన్ని తనదైన శైలిలో తీయాలని తలపెట్టాడు. ఇంతవరకు హెవీ పాత్రల జోలికి పోని శర్వానంద్‌తో డాన్ వేషం వేయించాడు. అటు పాతికేళ్ల యువకుడిగా, ఇటు నడి నలభైలలో వున్నవాడిగా శర్వానంద్ రెండు షేడ్స్‌ని ఎలాంటి ఇబ్బంది, ఇరకాటం లేకుండా పోషించేసాడు.
శర్వానంద్ వరకు తన పాత్రకి న్యాయం చేయగలిగాడు కానీ సుధీర్‌వర్మ మాత్రం తాను స్ఫూర్తిగా ఎంచుకున్న చిత్రంలోని డ్రామాని రీక్రియేట్ చేయలేకపోయాడు. పూర్తిగా షాట్ మేకింగ్‌పై, విజువల్ అప్పీల్‌పై ఫోకస్ పెట్టి కథ మీద కావాల్సినంత కసరత్తు చేయలేదు. దీంతో 'రణరంగం' కళకళలాడింది కానీ కథలో లీనం చేయలేకపోయింది. నిజానికి సుధీర్ వర్మ ఎంచుకున్న నేపథ్యం చాలా బాగుంది. మద్యపాన నిషేధం సమయంలో మద్యాన్ని ఇల్లీగల్‌గా రవాణా చేస్తూ పైకి ఎదిగిన యువకుడి కథ ఇది. క్యారెక్టర్ రైజ్ చూపించడానికి కావాల్సినంత స్టఫ్ వుంది.
కానీ ముందే చెప్పినట్టుగా కాంటెంట్ కంటే విజువల్ అప్పీల్‌పై దృష్టి ఎక్కువ వుండడంతో సన్నివేశాల్లో బలహీనతని గుర్తించలేకపోయారు. లొకేషన్లు కానీ, రెడ్ కలర్‌ని హైలైట్ చేస్తూ ఛాయాగ్రహణం కానీ కళ్లు చెదిరేలా వుంటుంది. నిర్మాతలు చేతికి ఎముక లేనట్టు ఖర్చు పెట్టేస్తే… 'వావ్' అనిపించే లొకేషన్లలో దర్శకుడు ఈ చిత్రాన్ని ఒక విజువల్ పెయింటింగ్‌లా తీర్చిదిద్దాడు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్ వేల్యూస్‌ని ఇష్టపడే వారిని ఇట్టే కట్టి పడేస్తుంది. నేపథ్య సంగీతంతో పాటు సౌండ్ డిజైన్, ఎఫెక్ట్స్ హింసని తారాస్థాయిలో చూపిస్తాయి. క్వెంటిన్ టరంటీనోని ఆరాధించే సుధీర్ వర్మ వయొలెన్స్‌కి సంబంధించిన సీన్స్‌లో తన ఫేవరెట్ డైరెక్టర్ శైలిని దించేసాడు.
ఫైట్ సీన్స్‌లో బ్లడ్ స్ప్లాష్ అవడాన్ని కూడా భలేగా చూపించారు. విజువల్‌గా కళ్లు చెదిరేలా రూపొందిన ఈ చిత్రం బలహీనతలని కవర్ చేసుకోవడానికి కూడా దాని వెనకే నక్కింది అనిపిస్తుంది. ఎందుకంటే సన్నివేశాల పరంగా ఎందులోను బలం లేదు. హీరో ఒక సాధారణ స్థాయి నుంచి పవర్‌ఫుల్ వ్యక్తిగా ఎదిగినా కానీ ఆ ప్రాసెస్‌లో ఒక్క ఎలివేషన్ సీన్ కూడా ఆకట్టుకోదు. చాలా ఫ్లాట్ నెరేషన్‌తో సాగిపోతున్న ఈ చిత్రంలో ప్రేమకథ కూడా సరిగా ఇమడలేదు. కనీసం లవ్‌స్టోరీ పరంగా అయినా ఏదైనా కొత్తదనం చూపించే ప్రయత్నం చేసినట్టయితే బాగుండేది కానీ ఆ దిశగా ప్రయత్నం జరగలేదు.
కాంటెంట్ లేకపోవడంతో హీరో తాలూకు రెండు దశల్ని ప్యారలల్‌గా నడిపించే విధానాన్ని ఫాలో అయ్యారు. అది కాస్తా ఎఫెక్టివ్‌గా లేకుండా గిమ్మిక్‌లా అనిపిస్తుంది. మాటిమాటికీ కథ పాజ్ అవుతూ అటు ఇటు మారుతోంటే… ఇక్కడ పాజ్ అయిన చోట ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ ఏర్పడాలి. కానీ అలాంటి ఉత్కంఠ ఎక్కడా చోటు చేసుకోలేదు. పైగా ఆ పాజ్‌లు ఇక్కడ కాకుండా మరెక్కడ ఇచ్చినా ఫర్వాలేదన్నంత సాధారణంగా అనిపిస్తుంటాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇంత ఫ్లాట్‌గా రన్ అవుతూ వుంటే ఇక ఆ డ్రామాలోకి ఎవరైనా ఎలా లీనమవగలరు?
హీరోని రెండు షేడ్స్‌లో, అతని జీవితంలోని రెండు స్టేజెస్‌లో చూపించిన దాంట్లోను ఎటువంటి ఎఫెక్టివ్‌నెస్ లేదు. ఎదిగే దశలో ఎమ్మెల్యేతో తలపడినా, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో పోరాడుతున్నా కానీ అంతా సీన్ తర్వాత సీన్‌గా అలా ఫ్లాట్ నెరేషన్‌తో వెళ్లిపోతుంటుంది. హీరోకి కావాల్సిన కొన్ని పాత్రలు చనిపోయినపుడు కూడా ఎమోషన్ ఏమంత వర్కవుట్ అవలేదంటే డ్రామా ఎంత బలహీనంగా వుందనేది అర్థం చేసుకోవచ్చు.
శర్వానంద్ చాలా బాగా నటించాడు. తన వరకు వంక పెట్టడానికంటూ ఏమీ లేదు. కళ్యాణి ప్రియదర్శన్ పరిచయమైన సన్నివేశాలు కొన్ని క్యూట్‌గా అనిపిస్తాయి. కానీ లవ్‌స్టోరీ ముందుకి సాగే కొద్దీ ఎటు పోతోందనేది ప్రిడిక్టబుల్ అయిపోతుంది. కాజల్ అగర్వాల్ అయితే అలంకారానికి మాత్రమే వున్నట్టు అనిపిస్తుంది. మురళీశర్మ డిఫరెంట్ లుక్, డైలాగ్ డెలివరీతో బాగా చేసాడు. అజయ్, బ్రహ్మాజీ పాత్రలు చాలా రొటీన్‌గా సాగాయి.
ముందే చెప్పినట్టు సాంకేతికంగా చాలా బాగున్న ఈ చిత్రంలో ఏ డిపార్ట్‌మెంట్‌కీ వంక పెట్టడానికి లేదు. లొకేషన్ స్కౌటింగ్ చేసిన ప్రొడక్షన్ డిజైన్ టీమ్‌కి ప్రత్యేక అభినందనలు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. దర్శకుడి క్రియేటివ్ షాట్ మేకింగ్‌ని అంత ఎఫెక్టివ్‌గా స్క్రీన్ మీదకి తీసుకురావడం మాటలు కాదు. నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు అంతంతమాత్రంగా అనిపిస్తాయి. పెళ్లి పాటని చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.
దర్శకుడిగా సుధీర్ వర్మ మరోసారి కాంటెంట్‌కి బ్యాక్ సీట్ ఇచ్చాడు. స్వామిరారా చిత్రాన్ని మంచి ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన సుధీర్ మళ్లీ అలాంటి వినోదం వైపు వెళ్లకపోవడం ఆశ్చర్యంగా వుంది. ఫ్లాట్ నెరేషన్‌కి చివర్లో కొన్ని రొటీన్ ట్విస్టులు ఇచ్చేస్తే విజువల్ అప్పీల్ వల్ల సినిమాలు వర్కవుట్ అయిపోవు. రణరంగం చిత్రానికి శర్వానంద్, మేకింగ్ వేల్యూస్, టెక్నికల్ ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్లస్ కాగా, ఎంగేజ్ చేసే స్టోరీ, స్క్రీన్‌ప్లే, సీన్స్ లేకపోవడం అతి పెద్ద మైనస్.
బాటమ్ లైన్: విషయం లేని రణం!
-గణేష్ రావూరి