ఈమధ్య ఓ ఈవెంట్ లో చేతిలో వాటర్ బాటిల్ తో ప్రత్యక్షమయ్యాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. సెలబ్రిటీలు ఎవరైనా ఇలా వ్యక్తిగతంగా మంచి నీళ్ల బాటిల్ క్యారీ చేయడం కామన్. కానీ కోహ్లి పట్టుకున్న బాటిల్ మాత్రం వెరీ కాస్ట్ లీ. దీన్ని బ్లాక్ వాటర్ అంటారు. ఇప్పుడు సెలబ్రిటీలు ఇదే తాగుతున్నారు. దీని రేటు లీటరు వెయ్యి రూపాయల నుంచి 3వేల రూపాయల వరకు ఉంటుంది.
ఈ బ్లాక్ వాటర్ తో కోహ్లి విలాసవంతమైన జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. నిజానికి కోహ్లి మంచి నీళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక దశలో అతడు ఫ్రాన్స్ నుంచి నీళ్లు దిగుమతి చేసుకున్నాడు కూడా. ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతశ్రేణి నుంచి సేకరించిన ఉత్కృష్టమైన మంచి నీళ్లను కోహ్లి తాగేవాడు. ఇప్పుడు గుజరాత్ లోనే బ్లాక్ వాటర్ ప్లాంట్ ఒకటి వెలిసింది.
కేవలం మంచి నీళ్లు మాత్రమే కాదు, దుస్తుల నుంచి కార్లు, గ్యాడ్జెట్స్ వరకు కోహ్లి ప్రతి అంశంలో ఖరీదైన జీవితాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లి వాడుతున్న వాచ్ ఖరీదు అక్షరాలా 8.7 లక్షల రూపాయలు. రోలెక్స్ కు చెందిన డేటోనా రెయిన్ బో ఎవరోస్ మోడల్ ఇది. ఇలాంటి వాచీలు కోహ్లి దగ్గర పదుల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు అన్ని ఖరీదైన వాచ్ బ్రాండ్స్ కోహ్లి కలెక్షన్ లో ఉన్నాయి.
ఇక కార్ల విషయానికొస్తే విరాట్ కోహ్లి దగ్గర లేని కంపెనీ లేదు. బెంట్లీ, బెంజ్, ఆడి, రేంజ్ రోవర్ నుంచి రెనాల్ట్ వరకు దాదాపు అన్ని కంపెనీల కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్రికెటర్ ఎక్కువగా బెంట్లీ కారులోనే తిరుగుతున్నాడు. ఇతడి దగ్గరున్న కార్లు అన్నీ కలిపితే వాటి ఖరీదు అటు ఇటుగా 15 కోట్ల రూపాయలు. విరాట్ భవనంలో ఏకంగా కార్ల గ్యారేజీ ఉంది. ప్రస్తుతం ఈయన వాడుతున్న బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ కారు ఖరీదు ఇండియాలో 5 కోట్ల రూపాయలు. ఇక బైకుల విషయానికొస్తే, పెద్దగా వాడకపోయినా ఖరీదైన బైక్స్ కొంటూనే ఉంటాడు విరాట్.
గతేడాది లాక్ డౌన్ టైమ్ లో గురుగ్రామ్ లోని తన ఖరీదైన బంగ్లాలో గడిపాడు కోహ్లి. ఈ బంగ్లా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ ను డిజైన్ చేసే బాధ్యతను కన్ఫ్లూయన్స్ అనే సంస్థకు అప్పగించాడు. ఈ కంపెనీకి అక్షరాలా 80 కోట్ల రూపాయలు చెల్లించాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక ముంబయిలోని వర్లీలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లో 23వ ఫ్లోర్ మొత్తం కొనేశాడు. 5 బెడ్ రూమ్స్ తో పూర్తి లగ్జరీలతో, సముద్రం ఫేసింగ్ తో ఉంది ఆ ఫ్లాట్.
ఇక మొబైల్ విషయంలో కోహ్లి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు మార్చుకుంటాడు. ఇతడి దగ్గర ఖరీదైన ఐఫోన్, బ్లాక్ బెర్రీ ఫోన్లు 5 ఉన్నాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాడు ఈ క్రికెట్.
ఇక ఈ క్రికెటర్ ఆదాయం విషయానికొస్తే.. బీసీసీఐ నుంచి ఏడాదికి 7 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ లో భాగంగా ఈ ఏడాది దశలవారీగా 17 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. ఇతడి మొత్తం ఐపీఎల్ ఆదాయం విలువ అటుఇటుగా 140 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా బ్రాండ్స్ రూపంలో ప్రతి నెలా 10 కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు విరాట్. మొత్తంగా ఇతడి నెట్ వర్త్ విలువ 2021 అంచనాల ప్రకారం 980 కోట్ల రూపాయలు.