కాలేజీ ఫీజు తక్కువే. కానీ దానికి అడ్మిషన్ ఫీజు, ల్యాబ్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు.. అన్నీ కలుపుకొంటే.. మాత్రం తడిసి మోపెడవుతుంది. ఇన్నాళ్లూ ఇలానే మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెట్టాయి కార్పొరేట్ విద్యాసంస్థలు.
ఇకపై ఆ ఆటలకు చెల్లుచీటీ రాసేశారు సీఎం జగన్. ఫీజుల్ని నియంత్రిస్తూ, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం టెన్త్ క్లాస్ కి గరిష్ట ఫీజు హాస్టల్ తో కలిపి రూ.42వేలు. ఇంటర్ కి గరిష్ట ఫీజు హాస్టల్, నీట్ కోచింగ్ తో కలిపి రూ. 64వేలు. ఇప్పటి వరకు దీనికి నాలుగైదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఈ ప్రకటనతో బిక్కచచ్చిపోయాయి.
ఏపీలో టెన్త్, ఇంటర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలే ఇందులో చాలా ఉన్నాయి. అయితే అడ్డగోలుగా ఫీజులు పెంచుకోడానికి, దానికి వేరే పేర్లు పెట్టుకోడానికి అవకాశం లేకుండా చేసింది.
నగరాల్లో సైన్స్ స్టూడెంట్ కి ఇంటర్ ఫీజు గరిష్టంగా 20వేల రూపాయలు. అందులోనే ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, లైబ్రరీ ఫీజు అన్నీ ఉంటాయి. పోనీ హాస్టల్ పెట్టి మేనేజ్ చేస్తామనుకుంటే దానికి కూడా లిమిట్ ఉంది. ఎంత మంచి వసతులున్నా.. నగరాల్లో గరిష్టంగా హాస్టల్ ఫీజు రూ.24వేలు మాత్రమే వసూలు చేయాలి.
పోనీ జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి కోచింగ్ లు పెట్టి అదనంగా బాదేస్తామనుకున్నా కూదరదు. మెటీరియల్ ఫీజు, మాక్ టెస్ట్ లతో కలిపి ఎలాంటి కోచింగ్ కి అయినా రూ.20వేలు దాటకూడదు. కాదూ కూడదు, మాకు పెట్టుబడి ఎక్కువ, ఖర్చు తక్కువ అని కాలేజీ యాజమాన్యం భావిస్తే.. ఓ వెసులుబాటు ఉంది. ఉపాధ్యాయుల జీతాలు, వారి అర్హతలు.. ఇతర వివరాలన్నిటితో లెక్కలు ప్రభుత్వానికి పంపితే, విచారణ జరుపుతారు. అలా దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఫీజులు బాదేయకూడదు.
ప్రభుత్వం అనుమతిస్తేనే, అంతమేర మాత్రమే పెంచుకునే అవకాశం ఉంది. ఈసారి ఇలాంటి ఫీజులు నిర్ణయించే స్థానాల్లో ఉన్నవారిపై కూడా ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది కాబట్టి, ప్రైవేటు యాజమాన్యాల పప్పులు ఉడక్కపోవచ్చు.
స్కూల్ యాజమాన్యాలకు కూడా షాకే..
హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు.. ఇలా రకరకాల పేర్లతో.. ఏపీలో టెన్త్ ఫీజు లక్ష రూపాయల గరిష్ట స్థాయిని ఎప్పుడో దాటేసింది. కానీ ఇప్పుడది రూ.24వేలకు పరిమితం కావాల్సి వస్తోంది.
నర్సరీ నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో 10వేల రూపాయలు, పట్టణాల్లో 11వేలు, నగరాల్లో 12వేలుగా ఫీజులు నిర్ణయించారు. 6నుంచి 10 తరగతి వరకు గ్రామాల్లో 12వేల రూపాయలు, పట్టణాల్లో 15వేలు, నగరాల్లో 18వేలుగా ఫీజు నిర్ణయించారు. ఇక విద్యార్థి హాస్టల్ ఎంచుకుంటే, గ్రామాల్లో 18వేలు, పట్టణాల్లో 20వేలు, నగరాల్లో 24వేలు గరిష్ట ఫీజుగా నిర్ణయించారు.
అంటే ఒక టెన్త్ స్టూడెంట్.. విజయవాడ హాస్టల్ లో ఉండి చదువుకుంటే అతని వద్ద కేవలం 42వేల రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి వేర్వేరు పేర్లతో, వేర్వేరు ఫీజులు వసూలు చేస్తే సంస్థ గుర్తింపు రద్దు చేస్తారు.
గతంలో కూడా పలు ప్రభుత్వాలు ఫీజులపై నియంత్రణ విధించినా, స్పెషల్ పర్మిషన్ల పేరుతో గేట్లు ఎత్తేశాయి. ఈసారి అలాంటి లోటుపాట్లు లేకుండా నిబంధనలు కచ్చితంగా అమలైతే మాత్రం ఏపీలో విద్యా వ్యాపారానికి చెక్ పడినట్టే.