రాజీనామాపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి చెప్పిన గడువు వచ్చేసింది. ఈరోజు ఆయన తాడోపేడో తేల్చేస్తానన్నారు. అయితే ఆయన ఈరోజు ఏం చేయబోతున్నారు..? హాట్ హాట్ గా ఉన్న బుచ్చయ్య నుంచి ఎలాంటి ప్రకటన రాబోతోంది..? టీడీపీలోనే కొనసాగుతారా.. లేక బెదిరించినట్టు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తారా? మరికొన్ని గంటల్లో తేలాల్సి ఉంది.
మాట మీద నిలబడతారా..?
బుచ్చయ్య చౌదరి మాటమీద నిలబడతారా లేదా అనేది ఈ రోజుతో తేలిపోతుంది. ఆయన నిర్ణయం ఏదైనా సరే.. మీడియా ముందుకొచ్చి ప్రకటిస్తే కచ్చితంగా బుచ్చయ్య తాను చెప్పిన డెడ్ లైన్ ని కాపాడుకున్నట్టవుతుంది. నేరుగా మీడియా ముందుకు రాకుండా సైలెంట్ అయ్యారంటే మాత్రం బుచ్చయ్య బెదిరింపుల్ని ఎవరూ లెక్కచేయరు.
టీడీపీలో కొనసాగితే..?
ఇంత జరిగాక ఇంకా బుచ్చయ్య టీడీపీలో కొనసాగితే అది ఆయన పరువుకే భంగం. ఇంతలా బెదిరించి మళ్లీ అదే పార్టీలో కొనసాగుతున్నారనే అపప్రథ ఆయనమీద పడుతుంది. బెదిరింపులకు బాబు భయపడలేదు, బుచ్చయ్య మీద చంద్రబాబుదే పైచేయి అనే ఫీలింగ్ జనాల్లో కలుగుతుంది.
ఇప్పుడే ఫోన్లు ఎత్తనివారు, మెత్తబడిన తర్వాత మాత్రం కనికరిస్తారన్న నమ్మకం లేదు. రెండోసారి అలిగితే పట్టించుకునేవారే ఉండరు కాబట్టి, టీడీపీలో బుచ్చయ్య కుక్కిన పేనులా ఉండక తప్పదు. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ సీటు ఎగరగొట్టినవాళ్లు, వచ్చే ఎన్నికల్లో రూరల్ మాత్రం మిగుల్చుతారన్న గ్యారెంటీ లేదు. సో.. టీడీపీలో కొనసాగితే మాత్రం బుచ్చయ్య రాజకీయ జీవితం భూస్థాపితం అయినట్టే లెక్క.
టీడీపీ నుంచి బయటకొస్తే..?
ఒకవేళ అంతా అనుమానించినట్టు బుచ్చయ్య టీడీపీకి రాజీనామా చేస్తే బాబుకు బ్యాండే. ఇప్పటికే పార్టీపై, లోకేష్ పై పలు విమర్శలు చేసిన బుచ్చయ్య.. ఈరోజు రాజీనామా ప్రకటన సందర్భంగా పార్ట్-2ను చూపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకున్న టైమ్ లో అన్నీ కళ్లారా చూసిన బుచ్చయ్య, ఇప్పుడు మరోసారి ఆ బాగోతాన్ని బయటపెట్టి బాబు పరువును బజారుకు ఈడ్చడం ఖాయం. దీనికి సంబంధించి బుచ్చయ్య దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయంటారు తెలిసినవాళ్లు.
వైశ్రాయ్ హోటల్ ఉదంతం, లక్ష్మీపార్వతిని బద్నామ్ చేసిన ఘటన.. ఇలా ఎన్నో అంశాల్ని బుచ్చయ్య టచ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు పరువు గంగలో కలవడం ఖాయం. ఎందుకంటే, ఇన్నాళ్లూ వీటిపై చాలామంది చాలా చెప్పారు కానీ.. అటు ఎన్టీఆర్ ను, ఇటు చంద్రబాబును దగ్గరుండి చూసి, అప్పటి ఘటనల్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బుచ్చయ్య లాంటి వ్యక్తులు నోరువిప్పితే సంచలనమే.
లోకేష్ కి కూడా బ్యాండే..
లోకేష్ పై ఇప్పటికే బుచ్చయ్యకు పీకలదాకా కోపం ఉంది. కనీసం తన ఫోన్ కూడా ఎత్తలేదని, సీనియర్ ని అన్న గౌరవం కూడా ఇవ్వలేదని పలుమార్లు చెప్పారు. ఇప్పుడిక నేరుగా లోకేష్ పై దాడి మొదలు పెడతారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అక్రమాలు, అవినీతి బండారాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉంది. అమరావతి భూదందాలో కీలక అంశాల్ని కూడా బుచ్చయ్య టచ్ చేసే అవకాశం ఉంది.
బయటకొస్తే.. ఏ పార్టీలోకి వెళ్తారు..
టీడీపీకి గుడ్ బై చెబితే.. భవిష్యత్ కార్యాచరణపై కూడా బుచ్చయ్య ప్రకటించాల్సి ఉంటుంది. పోనీ కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని చెప్పి తప్పించుకున్నా.. ఆ తర్వాత ఆయన ముందున్నవి రెండే ఆప్షన్లు.
ఒకటి వైసీపీ, రెండు బీజేపీ. ప్రస్తుతానికయితే బీజేపీలో చేరేందుకే బుచ్చయ్య సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బుచ్చయ్య అనుచరులు మాత్రం భారీ ఎత్తున వైసీపీలో చేరినట్టు వార్తలొస్తున్నాయి. వీటిల్లో ఏది నిజమో, ఎంత నిజమో.. మరికొన్ని గంటల్లో తేలిపోయే అవకాశముంది.