భారతదేశంలో కరోనా ప్రస్తుతం ఎండెమిక్ స్టేజ్ కు చేరి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశం గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం చర్చలో ఉన్న మూడో వేవ్ గురించి కూడా ఆమె స్పందించారు. మూడో వేవ్ వస్తుంది.. అంటూ ఎవరూ స్పష్టంగా చెప్పలేరని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. మరి ఇంతకీ ఈ ఎండెమిక్ స్టేజ్ అంటే ఏమిటనే అంశం గురించి ఆమె వివరణ ఇస్తూ.. లో లెవల్ ట్రాన్స్మిషన్ లేదా మోడరేట్ లెవల్ ట్రాన్మిషన్ నే ఎండెమిక్ స్టేజ్ గా చెప్పారు.
ప్రత్యేకించి గతంలో చూసిన స్థాయిలో కరోనా కేసులు పతాక స్థాయిలో ఉండటం బహుశా ఇక ఉండకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవైపు త్వరలోనే మూడో వేవ్ అని, ఆరు లక్షల స్థాయి యాక్టివ్ కేసులంటూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణుల కమిటీ పీఎంవోకు ఒక నివేదిక ఇచ్చిందన్న వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ ఈ రకంగా స్పందించడం గమనార్హం.
ఇండియాలో గత కొన్ని రోజుల పరిణామాల గురించి సౌమ్య స్వామినాథన్ ప్రస్తావించారు. కేసుల సంఖ్య ఒక్కో రోజు పెరగడం, మరో రోజు కాస్త తగ్గడం జరుగుతూ ఉంది. దాదాపు రెండు నెలల నుంచి పరిస్థితి ఇలానే ఉందనే విషయం ఇక్కడ గమనార్హం. జూలై, ఆగస్టు నెలల్లో.. రోజువారీ కరోనా కేసులు కాస్త పెరుగుతూ, మరి కాస్త తగ్గుతూ.. ఉన్నాయి. వారాల సగటును గమనిస్తేనే.. తేడా అర్థం అవుతుంది. ఇదే ఎండెమిక్ స్టేజ్ కు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ దశలో కరోనా భౌగోళికంగా ఒక ప్రాంతానికి పరిమితం కావడం, అక్కడ ప్రజల ఇమ్యూనిటీ లెవల్ ఆధారంగా వ్యాపించడం జరుగుతుందనేది డబ్ల్యూటీహెచ్వో ఎండెమిక్ స్టేజ్ కు ఇచ్చిన నిర్వచనం.
ఇప్పుడు ఇండియాలో కరోనా పరిస్థితి అదే అని సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. ఇది వరకూ కరోనా తీవ్రస్థాయిలో ప్రబలని ప్రాంతాల్లో ఇప్పుడు కేసులు నమోదు కావడం ఉండవచ్చంటున్నారు. అంటే ఇప్పటి వరకూ కరోనా సోకని వారి మధ్యనే వైరస్ ట్రాన్స్మిషన్ అవుతుండవచ్చనేది ఇందుకు సంబంధించి ఒక వివరణ. ఈ నేపథ్యంలో కేసులు సంఖ్య ఒకే స్థాయిలో కాస్త హెచ్చుతగ్గులతో నమోదవుతూ ఉండవచ్చు. ఈ విషయాన్ని ప్రజల్లోని ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ వంటివి ప్రభావితం చేస్తాయని సౌమ్య చెప్పారు.
ఇది వరకూ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా వచ్చిన చోట ఇప్పుడు కొత్తగా కేసుల నమోదు తక్కువగా ఉండటం, అలాగే వ్యాక్సినేషన్ ప్రభావం వల్ల కొత్త కేసులు రిజిస్టర్ కాకపోవడం వంటి దశలో ఇండియా ఉందన్నట్టుగా ఆమె వివరించారు.
బహుశా ఇక భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండకపోవచ్చని, ఇది వరకూ చూసిన పతాక స్థాయిలేవీ ఉండకపోవచ్చని ఆమె వివరించడం గమనార్హం. ఇదే అంశం గురించి కాస్త విశ్లేషిస్తే.. దేశంలో కరోనా మలేరియా వంటి దశకు చేరినట్టేనేమో! కేసులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, ఇమ్యూనిటీ ద్వారా ప్రజలు దాన్ని ఎదుర్కొంటూ ఉంటారు.
మనం గమనించం కానీ, సీజన్ల వారీగా దేశంలో మలేరియా కేసుల సంఖ్య కూడా వేల, లక్షల సంఖ్యల్లోనే వస్తూ ఉంటాయి. సౌమ్య స్వామినాథన్ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే.. కరోనా కూడా ఇండియాలో ఆ దశలోనే ఉందనుకోవచ్చు. మూడో వేవ్ వంటి ఊహాగానాలను ఆమె సమర్థించకపోవడం గమనార్హం.
సెరో సర్వే చెప్పిన విషయాన్ని ఇక్కడప్రస్తావిస్తే.. దేశంలో వంద కోట్ల మందికి పైగా ప్రజలకు ఇప్పటికే కరోనా సోకింది. ఇక ప్రధానంగా.. మిగిలిన వారి మధ్యనే మూడో వేవ్ ఉంటుందనే ప్రిడిక్షన్లు ఇది వరకే వచ్చాయి. సౌమ్య స్వామినాథన్ కూడా.. ఇది ఎండెమిక్ స్టేజ్ అని, స్వల్ప, మధ్యమ స్థాయి వ్యాప్తి ఉంటుందని వివరిస్తున్నారు.