ఇటు చూడు లోకేష్.. ఇది నీ కోసమే…!

రమ్య హత్య ఘటన జరిగినప్పుడు లోకేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, దాన్ని ఇంకా టీడీపీ భజనపరులు మోస్తూనే ఉన్నారు. మా లోకేష్ బాబు అరెస్ట్ అయ్యాడోచ్, బైటకొచ్చేటప్పుడు పిడికిలి బిగించాడు, కళ్లెర్రజేశాడు..…

రమ్య హత్య ఘటన జరిగినప్పుడు లోకేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, దాన్ని ఇంకా టీడీపీ భజనపరులు మోస్తూనే ఉన్నారు. మా లోకేష్ బాబు అరెస్ట్ అయ్యాడోచ్, బైటకొచ్చేటప్పుడు పిడికిలి బిగించాడు, కళ్లెర్రజేశాడు.. అంటూ ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్నారు. 

ప్రభుత్వ వైఫల్యం అంటూ అప్పట్లో లోకేష్ గగ్గోలు పెట్టారు. పరామర్శించి వచ్చేయకుండా, బయట నాయకులతో మీటింగ్ పెట్టి, జనాల్ని రెచ్చగొట్టాలని చూసి, కావాలనే అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ అసమర్థత అంటూ రంకెలేశారు. అప్పుడు లోకేష్ చేసింది ఓవరాక్షన్ అనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు అదే విషయం జాతీయ ఎస్సీ కమిషన్ సాక్షిగా మరోసారి రుజువైంది.

అప్పుడేం జరిగింది

శవరాజకీయాలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకుంటున్న లోకేష్, ఇటీవల ఎక్కడ ఏ హత్య, ఆత్మహత్య జరిగినా అక్కడ వాలిపోతున్నారు. ఆ ఘటనకు, ప్రభుత్వ వైఫల్యం అనే ముద్ర వేయడానికి ఆరాటపడుతున్నారు. రమ్య హత్య వ్యవహారం కూడా అలాగే అనుకున్నారు. అందులోనూ బాధితులు దళితులు కావడంతో మరికాస్త మంట ఎగదోయాలనుకున్నారు. కానీ లోకేష్ పప్పులు ఉడకలేదు. 

సహజంగానే బాధలో ఉన్న రమ్య కుటుంబ సభ్యులు లోకేష్ ఓదార్పుని సాదరంగా స్వీకరించారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తమకు సత్వర న్యాయం జరగాలని లోకేష్ తో మొర పెట్టుకున్నారు.

అయితే పరామర్శ అనంతరం ఆ ఇంటి నుంచి బయటకొచ్చిన లోకేష్, సవాళ్లమీద సవాళ్లు విసిరారు. మాజీ మంత్రుల్ని, టీడీపీ నాయకుల్ని పక్కనపెట్టుకుని రెచ్చిపోయారు. దళితులపై దాడి జరిగిందని, ప్రభుత్వం చేతగానితనానికి అది నిదర్శనం అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.

ఇప్పుడేం జరిగింది

రమ్య కుటుంబాన్ని పరామర్శించిన జాతీయ ఎస్సీ కమిషన్ పోలీసుల తీరుని సమర్థించింది. ప్రభుత్వ సత్వర స్పందనను అభినందించింది. హత్యకు పాల్పడిన నిందితుడ్ని అరెస్ట్ చేసి 6 రోజుల్లోనే చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసుల చొరవను మెచ్చుకుంది.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, కేసును కొలిక్కి తీసుకొచ్చేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రత్యేకంగా అభినందించింది.

తక్షణం స్పందించిన ప్రభుత్వం

దుర్ఘటన జరిగిన వెంటనే రూ.10లక్షల నష్టపరిహారం ప్రకటించడమే కాదు, రోజుల వ్యవధిలోనే ఆమె కుటుంబ సభ్యులకు అందించింది ప్రభుత్వం. బిడ్డలేని లోటు తీర్చలేమని, సత్వర న్యాయం చేసి, వారి కన్నీళ్లు తుడుస్తామని చెప్పింది. ఈ క్రమంలో మీడియా ముందుకొచ్చిన రమ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 

అక్కడే మరో ట్విస్ట్.. మా చినబాబు పరామర్శకు వస్తే, ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతారా అంటూ.. సోషల్ మీడియాలో టీడీపీ వర్గం రెచ్చిపోయింది. డబ్బులకు అమ్ముడుపోయారంటూ వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. బిడ్డ పోయిన బాధ కంటే, టీడీపీ వారి సూటిపోటి మాటలే ఆ కుటుంబాన్ని ఎక్కువగా బాధించాయి. అయినా లోకేష్ టీమ్ మారలేదు.

లోకేష్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది

ఇప్పటికైనా లోకేష్ ఇలాంటి వ్యవహారాల్లో తన ఓవర్ యాక్షన్ మానుకుంటే మేలు. స్వయంగా జాతీయ ఎస్సీ కమిషన్ అటు ప్రభుత్వాన్ని, ఇటు పోలీసు యంత్రాంగాన్ని మెచ్చుకుంది. ఇది చూసిన తర్వాతైనా లోకేష్ బుద్ధి తెచ్చుకోవాలి.

ఇకనైనా శవరాజకీయాలు ఆపేసి, అసలైన సమస్యలపై పోరాటం చేస్తే జనాలు ఆదరిస్తారు. లేదంటే.. ఇంకాస్త చీదరించుకుంటారు.