ష్…గప్‌చుప్. ఎంతో ఇష్టంతో రెండోసారి కూడా ఎన్నుకున్న పాలకుడాయన. అసలే దేశ భక్తికి ప్రతీకగా చెప్పుకునే పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. ఆయన పాలనలో దేశం వెలిగిపోతోంది….ఆ వెలుగు ఏ చీకట్లను నింపుతుందో ఎవరూ ప్రశ్నించ కూడదు. ఎందుకంటే అది దేశద్రోహం, రాజద్రోహం అవుతుంది జాగ్రత్త! దేశం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు మోడీ సర్కార్ అనే దేశ భక్త ప్రభుత్వం ముందుకొచ్చింది.
2022 నుంచి 2025 వరకూ.. నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లను సమీకరించేందుకు మోదీ సర్కార్ ప్రైవేట్‌కు దాసోహం అవుతోందనే ఆలోచన, మాట అసలు రాకూడదు. ఎందుకంటే అంతా కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాల ప్రాతిపదికగా నీతీ ఆయోగ్ రూపొందించిన ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను (ఎన్‌ఎంపీ)’ ప్రకారమే జరుగుతోంది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన 26,700 కిలోమీటర్ల జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్న వైనాన్ని చూస్తుంటే… దేశం ఎటుపోతున్నదో అర్థం కాక మాటలు రావు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తున్న ఆస్తులేంటో తెలుసుకుందాం.
400 రైల్వే స్టేషన్లు, 150 రైళ్లు, రైల్వే ట్రాక్, 42,300 కిలోమీటర్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్, 5,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల హైడ్రో, సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 8,000 కిలోమీటర్ల సహజ వాయువు పైప్ లైన్, 4,000 కిలోమీటర్ల HPCL, BPCL పైప్ లైన్లు, 2.86 లక్షల కిలోమీటర్ల భారత్ నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, BSNL, MTNL టవర్లు, 160 బొగ్గు గనులు, 761 మైనింగ్ బ్లాకులు, 25 విమానాశ్రయాలు, తొమ్మిది ఓడ రేవుల్లో 31 ప్రాజెక్టులు, రెండు జాతీయ స్టేడియాలు.
ఈ ప్రైవేటీకరణను జీర్ణించుకోలేని పౌర సమాజం చేష్టలుడిగి చూస్తోంది. నెటిజన్లు, ప్రజాస్వామిక వాదులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. “ఇప్పుడు సిగ్గూ, లజ్జా అన్నీ వదిలేశారు. రోడ్ల నుంచి రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు గనులు, చివరికి BSNL టవర్లు, కరెంటు వైర్లు కూడా వదలకుండా అంగట్లో అమ్మకానికి పెట్టారు మన దేశ పాలకులు. ఈ హోల్ సేల్ వేలాన్ని అడ్డుకోకపోతే చివరికి మిగిలేది చిప్పే” అంటూ ఓ పోస్టు పెట్టారు.
కానీ ప్రభుత్వం హోల్ లీజ్ అంటోంది. ప్రైవేట్ సంస్థలకు ఆదాయాలు రాగా, ప్రభుత్వానికి మాత్రం ఎందుకు నష్టాలొస్తాయో అంతుచిక్కని రహస్యం. ఈ దేశ భక్తి పార్టీ ప్రజావ్యతిరేక, ప్రైవేట్ అనుకూల వైఖరిని చెప్పడానికి… సిగ్గూ, లజ్జా అనే పదాలు సరిపోతాయా? అనేది పౌర సమాజం నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్న!