వైజాగ్ ఎంపీ అగ్రిమెంట్ వెనుక…

వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసుకున్న ఓ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, విజువల్ మీడియాల కన్నా ముందుగా ఈ వైనం మీద ‘గ్రేట్ ఆంధ్ర’…

వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసుకున్న ఓ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, విజువల్ మీడియాల కన్నా ముందుగా ఈ వైనం మీద ‘గ్రేట్ ఆంధ్ర’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘వైజాగ్ ఎంపీ జాక్ పాట్ కొట్టేసారా’ అంటూ వివరాలు వెలుగులోకి తెచ్చాకే దీని మీద మిగిలిన మీడియా దృష్టి మళ్లింది. అసలు ఇలాంటి అగ్రిమెంట్ ఎందుకు కుదిరి వుంటుంది? ఇదేమన్నా బినామీ వ్యవహారమా? వాళ్ల పేరు మీద ఎంవివి నే కొని, తన బినామీ భూములు తానే డెవలప్ మెంట్ కు తీసుకున్నారా? లేదా డెవలప్ మెంట్ కు ఇచ్చిన వారికి దొడ్డి దారిని భారీగా నగదు ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు ఈ ఒప్పందంతో కలిగాయి. కానీ ఇవేవీ అసలు కారణాలు కాదని తెలుస్తోంది.

ఇక్కడ ఎంవివి వ్యాపార చతురత గురించి కూడా విశాఖ రియల్ ఎస్టేట్ వర్గాలు గొప్పగా చెబుతున్నాయి. ఆయన విశాఖలో ఎక్కడ ఏ వెంచర్ వేసినా దాని ఆనుపానులు చూసుకుంటారట. కొన్న స్థలాన్ని సైలంట్ గా విస్తరించడానికి ఏమైనా అవకాశాలు వున్నాయా అన్నది చూస్తారట. అంటే కొన్న స్థలం వెనుక కొండలు, గుట్టలు, ప్రభుత్వ స్థలాలు ఇలాంటివి ఏమైనా వున్నాయా అని. అలా అయితే కొద్దిగా కలుపుకోవచ్చు అని.

అలాగే వివాదాస్పద స్థలాలు, కేసుల్లో చిక్కుకున్నవి, లావాదేవీలు నడుస్తున్నవి కూడా వెదుకుతారట. అలా అయితే తక్కువ రేటుకు వస్తాయి. తన పలుబడి, చాకచక్యం వాడి వాటిని వినియోగంలోకి తెచ్చుకోవచ్చు. నిజానికి చాలా మంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ జ‌నాలు చేసేది ఇదే.

ఇప్పుడు కూర్మన్మపాలం సమీపంలో, రైవాడ కాలవ ప్రాంతంలో తీసుకున్న సుమారు ఎనిమిది ఎకరాల వ్యవహారం ఇలాంటిదే అని తెలుస్తోంది. ఈ భూములు చిరకాలంగా వివాదంలో వున్నాయని బోగట్టా. సరైన లీగాలిటీ లేదని, సెక్షన్లు తేడా వున్నాయని తెలుస్తోంది. అలాంటి నేపధ్యంలో వారందరినీ కూర్చోపెట్టి, అవన్నీ తాను చూసుకుంటా అని, అయితే అలా అని ముందుగా కొనడం సాధ్యం కాదు కనుక డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కు ఒప్పించారని తెలుస్తోంది.

వివాదంలో వున్నదానికి కోట్లకు కోట్లు ముందే చెల్లిస్తే రిస్క్ అవుతుంది. వివాదం తేలకపోతే మొత్తం లాస్ అవుతుంది. అందుకే ఈ డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసారు. అప్పుడు కూడా వాళ్లకు ఏమని చెప్పారు. అన్నీ పూర్తయితే వారికి ఇచ్చే సుమారు 14 వేల చదరపు అడుగులను తానే తిరిగి తీసుకుని నగదు ఇస్తా అని ఎంవివి వారికి మౌఖికంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలా చూసుకున్నపుడు ఎనిమిది ఎకరాల విలువ, అప్పట్లో అంటే 2017 ప్రాంతంలో నాలుగు కోట్ల వరకు లెక్క తేలింది. అంటే ఎకరా 50 లక్షలు అన్నమాట. అంటే అప్పటి రేట్ల ప్రకారం మంచి రేటే. అదే విధంగా సుమారు 14000 చదరపు అడుగులు ఎంవివి బైబ్యాక్ చేసినా అమ్మిన వారికి లాభమే. ఎందుకంటే కనీసంలో కనీసం ఎస్ ఎఫ్ టి 4000 వేసుకున్నా అయిదు కోట్లు వస్తుంది.

ఇద్దరికీ ఇది లాభమే. ఎంవివి కి తక్కువ రేటుకు భూమి వస్తుంది. ముందస్తుగా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అమ్మిన వారికి వివాదంలో వున్న భూమి గట్టెక్కినట్లు అవుతుంది. ఎంపీగా గెలిచిన తరువాత ఎంవివి ఈ భూమి కి వున్న చట్టపరమైన అవరోధాలు సెట్ చేసుకోవాలని గట్టిగా ప్రయత్నించారని బోగట్టా. కానీ ఎందుకో అది వీలు కాలేదు. విజ‌యసాయి రెడ్డి దానికి అడ్డం పడ్డారని కూడా గుసగుసలు వున్నాయి.

మొత్తానికి విజ‌యసాయి నుంచి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యత ల నుంచి తప్పుకుని, సుబ్బారెడ్డి వచ్చిన తరువాత ఈ పని సాధ్యమైందని, దాంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిందని తెలుస్తోంది. గుసగుసలు నిజ‌మైతే విజ‌యసాయి అడ్డం పడిన పనిని సుబ్బారెడ్డి చేసారన్న మాట. మొత్తం మీద వీళ్లకు వీళ్ల మధ్యలో వున్న విబేధాల వల్ల పార్టీ పరువు బజ‌ర్న పడింది.