బాలీవుడ్ లో ఆనంద్ ఎల్ రాయ్ అటు దర్శకుడిగా, ఇటు నిర్మాతగా యమ బిజీగా కనిపిస్తారు. *తను వెడ్స్ మను* సినిమా నుంచి ఇతడి దశ తిరిగింది. దర్శకుడిగా వరస హిట్స్ ను పొందాడు, ఆ పై నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు. అటు నిర్మాతగా, ఇటు దర్శకుడిగా 15 యేళ్లలో ఇరవైకి పైగా సినిమాలను రూపొందించాడు.
మరి ఇన్ని సినిమాలు చేసిన వాడు 40 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఫ్లాట్ కొనడం గొప్ప విషయమో కాదో కానీ, ఈ దర్శకుడైతే.. విలాసవంతమైన ఈ నివాసాన్ని కొనుగోలు చేశాడట. ఇతడికి పెద్ద పెద్ద ఇళ్లన్నా, విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్ అన్నా చాలా ఇష్టమట. ఇలాంటి నేపథ్యంలో ఈ భారీ నివాసాన్ని ఇతడు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
విశేషం ఏమిటంటే.. రాయ్ కొన్న పక్క ఫ్లాట్ లోనే ఉంటుందట హీరోయిన్ కృతీ సనన్. ఇలా ఈ దర్శకుడు, ఆ హీరోయిన్ ఇరుగిల్లూ పొరుగిల్లు అయ్యారట. అయితే కృతీది మాత్రం సొంత నివాసం కాదని తెలుస్తోంది.
వాస్తవానికి ఆమె ఉంటున్న ఇల్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్ దట. ఆ మెగాస్టార్ ఇంట్లోనే ఈమె రెంట్ కు ఉంటోందట. ఏకంగా 40 కోట్ల రూపాయల విలువైన ఇంటిని రెంట్ కు మెయింటెయిన్ చేస్తోందంటూ కృతీది కూడా విలాసవంతమైన స్థాయే అని స్పష్టం అవుతోంది.