సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు, జనసేనాని పవన్ కల్యాణ్ కు సంబంధ బాంధవ్యాలు దాదాపుగా తెగిపోయిన సంగతి రాజకీయ ప్రపంచంలో ధ్రువపడిపోయింది. జనసేనతో ఆయన బంధం పూర్తిగా తెగిపోయింది. కమిటీల్లో చోటు పవన్ ఇవ్వలేదు సరే… చివరికి జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా జేడీ లక్ష్మీనారాయణ ఎక్కడా పాల్గొనడంలేదు. అలాగని ఖాళీగాలేరు. అయితే తన సొంత కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. ఈ మాజీ జేడీ-జనసేన బంధానికి పురిట్లోనే సంధికొట్టినట్టు అయింది. ఎన్నికల ముందు పొడిచిన రిలేషన్, ఎన్నికలు ముగియగానే పడుకుంది.
అయితే వీరిద్దరి మధ్య ఇంతగా ఎందుకు చెడింది అని ఆరా తీస్తున్నప్పుడు ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. లక్ష్మీనారాయణ, పవన్ మీద పార్టీ నిర్వహణ విషయంలో జోక్యం చేసుకుంటూ, ఆయనకు నచ్చని సలహాలు చెబుతూ.. వాటికోసం ఒత్తిడి చేశాడని, ఆ సలహాలు రుచించక పవన్ కల్యాణ్ దూరం పెట్టారని తెలుస్తోంది.
ప్రధానంగా లక్ష్మీనారాయణ ఏ సలహా చెప్పి పవన్ మీద ఒత్తిడి తెచ్చేవారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన జనసేన పార్టీని కాపుల పార్టీ అనే ముద్ర వచ్చేలా నడపాల్సిందిగా కోరేవారట. పవన్ కల్యాణ్ కు అంతరంగంలో ఎలా ఉన్నదో గానీ.. ఆ ముద్రను బహిరంగంగా తగిలించుకోవడం ఆయనకు ఇష్టంలేదు. పైగా అసలే ఆయన ‘నేను విశ్వమానవుడిని.. కులాలు, మతాలు నాకు అంటవు’ అని చెప్పుకుంటూ ఉంటారు. కులం ముద్రతో పార్టీని నడపడం ఆయనకు ఇష్టంలేదు.
అదే సమయంలో.. పవన్ కల్యాణ్ పార్టీలోని కొందరు కీలక నాయకుల మద్దతు కూడగట్టుకుంటూ.. ఒక కోటరీ తయారుచేసుకోవడానికి కూడా లక్ష్మీనారాయణ ప్రయత్నించారని సమాచారం. పరిస్థితులు ఇక్కడిదాకా వచ్చేసరికి ఇక పవన్ తాళలేకపోయారు. లక్ష్మీనారాయణకు నెమ్మదిగా పొగబెట్టారు. పక్కన బెట్టారు.
మొత్తానికి ఆ రకంగా.. సరిగ్గా ఎన్నికలకు ముందుగా… జనసేన పార్టీలోకి అడుగుపెట్టి… ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అనితికాలంలోనే పార్టీలో అందలాలు ఎక్కాలనుకున్న ఆయన ఆశలు అలా గల్లంతయ్యాయి.