కొండంత రాగంతీసి ‘తుమ్మదియ్యాలో’ పాట పాడినట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం. సుదీర్ఘకాలం కసరత్తు చేసినట్లుగా, సమీకరణాలు లెక్కవేసినట్లుగా బిల్డప్ లు ఇచ్చి, చివరికి ఆ పీఠాన్ని తీసుకువెళ్లి ‘అమ్మ’ పాదాల చెంతనే దఖలు పరిచారు. ‘నీవే తప్ప ఇతఃపరంబెరుగము.. కావవే మేడం… సంరక్షింపు మేడం…’ అంటూ సోనియమ్మనే వేడుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షస్థానాన్ని, భక్తుల కోరిక మేరకు తిరిగి మేడమ్ సోనియా చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ భావ దారిద్ర్యానికి, దాస్య భావజాలానికి ఇది చిహ్నం. పార్టీమీద ‘నెహ్రూ- గాంధీ’ కుటుంబ ముద్రపోయిందంటే గనుక.. అక్కడితో తమ చాప్టర్ క్లోజ్ అవుతుందని పార్టీలోని సీనియర్ ల ముసుగులోని వృద్దులంతా ఆందోళన చెందుతున్నారనడానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శనివారం జరిగిన పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం సోనియాను అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. గతంలో తల్లినుంచి వారసత్వాన్ని కొడుకు స్వీకరిస్తే.. ఇప్పుడు కొడుకునుంచి వారసత్వాన్ని తల్లి స్వీకరించాల్సి వచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకోవడం, సాంప్రదాయంగా తమ కుటుంబం వైభవం వెలగబెడుతున్న స్థానం నుంచి తాను స్వయంగా ఓడిపోవడం అప్పటి జాతీయ అధ్యక్షుడు రాహుల్ ను తీవ్రంగా మనఃక్షోభకు గురిచేసినట్లున్నాయి. ఆయన ఆ వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. ఆయన సోదరి ప్రియాంక, ఆ పరిస్థితికి మీరే కారణం, మీరు కష్టపడి పనిచేయలేదు.. అంటూ పార్టీ నాయకులను బహిరంగంగా నిందించారు.
అందరూ బుజ్జగించినా రాహుల్ వినలేదు. దూరంగా ఉండిపోవడంతో, గత్యంతరం లేక నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ సమావేశమైంది. పార్టీకి కొత్త ఇమేజి ముసుగు తొడగడానికి దళితనేతను అధ్యక్షుడిని చేస్తారని… ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గేలలో ఒకరు అవుతారని ప్రచారం జరిగింది. కానీ సమావేశం సోనియానే ఎన్నుకుంది. అనారోగ్య కారణాల రీత్యా పార్టీ అధ్యక్ష భారం మోయలేకపోతున్నారనే ప్రచారంతో గతంలో పదవినుంచి తప్పుకున్న సోనియా, ఈసారి ఎంతకాలం కొనసాగుతారో చూడాలి.