ఓ రాజ‌కీయ ‘నీతి’ కథ

ఆఖరికి రాజ‌కీయాలు ఇలాగే తయారయ్యాయి. మీరు చేసిన తప్పులే మేము చేస్తే తప్పా? అని ప్రశ్నించే వరకు వచ్చాయి. చట్టం వేరు..న్యాయం వేరు..ఈ రెండింటికి మధ్య చిన్న గ్యాప్ వుంది. దాన్ని ఆసరా చేసుకునే…

ఆఖరికి రాజ‌కీయాలు ఇలాగే తయారయ్యాయి. మీరు చేసిన తప్పులే మేము చేస్తే తప్పా? అని ప్రశ్నించే వరకు వచ్చాయి. చట్టం వేరు..న్యాయం వేరు..ఈ రెండింటికి మధ్య చిన్న గ్యాప్ వుంది. దాన్ని ఆసరా చేసుకునే వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు అంటారు యండమూరి తన డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవలలో. అదే జ‌రుగుతోంది ఇప్పుడు. ‘వాడు చౌకగా అమ్మాడు..మేం కొనుక్కున్నాం’ ఇందులో తప్పేంటీ? అన్నది చట్టం. వాడిని చౌకగా అమ్మేలా చేసారు..అది అన్యాయం అన్నది అసలు పాయింట్.

అమరావతి లో రాజ‌ధాని వస్తుందని ముందుగా తెలుసుకుని, భూములు కొనేసుకుని బాగుపడ్డారు అన్నది ఓ ఆరోపణ. మీరు విశాఖలో కూడా అదే చేస్తున్నారు కదా అన్నది కౌంటర్. విశాఖ రాజ‌ధాని కాదు కదా, కానివ్వడం లేదు కదా? అన్నది కౌంటర్. మేమేనేంటీ? మరి ఫిలిం సిటీకి భూములు ఎలా కొన్నారు అంటూ ఆర్గుమెంట్.

కూతుళ్లు..అల్లుళ్లు కొనుక్కుంటే మాకేంటి సంబంధం…అంటూ లా పాయింట్… మరి అమరావతిలో కూతుళ్ల పేరున కొంటేనే కదా యాగీ చేసారు అంటూ కౌంటర్. ఇలా ఒకటి కాదు. రెండు కాదు..వీళ్లు చేస్తున్నవి అవే..వాళ్లు నిన్న చేసిందీ ఇదే.

సమస్య ఏమిటంటే..

తప్పు చేసే వాడికే తెలుస్తుంది. ఎక్కడ ఎలా తప్పు చేయచ్చు అన్నది. చిరకాలం అధికారం అనుభవించిన తెలుగుదేశం జ‌నాలకు ఈ వ్యాపార సూక్ష్మాలు బాగా తెలుసు. మైనింగ్, ఇసుక, రియల్ ఎస్టేట్ ఇలా దేంట్లో ఆదాయ వనరు వుందీ అన్నది, అది ఎలా కైవసం చేసుకోవచ్చు అన్నదీ. కేవలం తెలుగుదేశం హయాంలోనే కాదు. కాంగ్రెస్ పాలన వున్నా, ఓ సామాజిక వర్గం హవా నడిచింది. ఆఖరికి వైఎస్ జ‌మానాలో కూడా. కానీ జ‌గన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అస్సలు పప్పులు ఉడకలేదు. అదే అసలు సమస్య.

దాంతో ఎక్కడ ఎలా వ్యాపారాలు సాగుతాయో, సాగుతున్నాయో తమకు ఎలాగూ తెలుసు..చేతిలో తమ మీడియా వుండనే వుంది. టముకేయడానికి…అదే జ‌రుగుతోంది ఇప్పుడు.

కానీ తేడా ఒక్కటే గతంలో మాదిరిగా బురద జ‌ల్లించుకోవడానికి ఎవ్వరూ సిద్దంగా లేరు. రివర్స్ అవుతున్నారు. తిరిగి బురదేస్తున్నారు. కులాల సమరంలో ఇవన్నీ భాగంగా మారిపోతున్నాయి. కమ్మ జ‌నాలు తప్పని సరిగా కార్నర్ అయిపోతున్నారు. ఎందుకంటే గత మూడు నాలుగు దశాబ్దాల కాలంగా రాష్ట్రంలో ఎక్కువ వ్యాపారాలు సాగించింది, బాగుపడింది వారే. అది చట్టపరంగానా? న్యాయపరంగానా? అన్నది వేరే సంగతి.

ఇప్పుడు అదే పని చేస్తున్నవారు, పాత సంగతులు అన్నీ తవ్వి పోస్తున్నారు. మళ్లీ మాట్లాడితే తామూ మీడియా అండ స్వంతంగానే సంపాదించుకుంటాం అంటున్నారు. చూస్తుంటే ఇక ఇదే వ్యవహారం ఇలా కొనసాగేలా వుంది. మీరు సంపాదించుకున్నన్నాళ్లు మీరు సంపాదించుకున్నారు. ఇక గమ్మున వుండండి. ఇప్పుడు మా టైమ్..అన్నదే ఈ మొత్తం వ్యవహారంలో నీతి అని అనుకోవాలేమో?

ఆర్వీ