గత మూడునాలుగు రోజులుగా భూమా నాగిరెడ్డి, శోభా దంపతులపై చీటింగ్ కేసు నమోదు కోర్టులో పిటిషన్ దాఖలైందనే ప్రచారం నేపథ్యంలో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆళ్లగడ్డ బీజేపీ ఇన్చార్జ్, నాగిరెడ్డి అన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రచారం తనను చాలా ఆవేదనకు గురి చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితి తమ కుటుంబానికి వస్తుందని ఏ రోజూ అనుకోలేదన్నారు.
తమ పిన్న, బాబాయ్ ఎంతో కష్టపడితే గానీ కుటుంబం ఇవాళ ఈ స్థాయికి రాలేదన్నారు. అలాంటి ఈ రోజు పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఎవరీ మద్దూరి అఖిలప్రియ అని ఆయన ప్రశ్నించారు. కనీసం ఆళ్లగడ్డలో వార్డు మెంబర్‌గా గెలవడానికి అర్హత లేని మహిళగా ఆయన తన సోదరి గురించి చెప్పుకొచ్చారు.
అలాంటి ఈమె భూమా నాగిరెడ్డి, శోభమ్మలపై చీటింగ్ కేసు పెట్టించే స్థాయికి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శోభా, నాగిరెడ్డి కూతురు కావడం వల్లే అఖిలప్రియ ఎమ్మెల్యే, ఆ తర్వాత తండ్రికి దక్కాల్సిన మంత్రి పదవి వరించాయన్నారు. నోటికి వచ్చేదే అబద్ధాలన్నారు.
హైదరాబాద్‌లో కిడ్నాప్‌లు, ఆళ్లగడ్డలో దొమ్మీలు, దోపిడీలకు పాల్పడ్డారన్నారు. అమాయక ప్రజలను కొట్టి ఆస్తులు రాయించు కుంటున్నారని మండిపడ్డారు. ఇన్ని చేస్తున్నా సహించామన్నారు. చివరికి తల్లిదండ్రులను కూడా విడిచి పెట్టలేదని అఖిలప్రియపై అన్న కిషోర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూమా నాగిరెడ్డి దంపతులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చారని పిటిషన్ వేయడం దారుణమన్నారు.
అది కూడా ఎవరో తెలియని అనామకుడికి ఆస్తులు విక్రయించినట్టు పిటిషన్ వేయడం ఏంటని ఆయన నిలదీశారు. 2011లో గుంటూరు నుంచి వచ్చి భూమా ఆస్తులు కొనేంత మగాడు ఉన్నాడా? అని ఆయన ప్రశ్నించారు. అఖిలప్రియను పక్కన పెడితే కుమారుడైన విఖ్యాత్ ఏం చేస్తున్నాడని భూమా కిషోర్ నిలదీశారు. కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని ఘాటుగా ప్రశ్నించారు.
ఏడాది క్రితం కూడా తన తండ్రి ఆస్తుల్ని అమ్మాడంటూ కేసు వేశాడని, సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నించారు. ఫోర్జరీ సంతకాలు చేసేటప్పుడు తల్లిదండ్రుల మొహాలు కనీసం గుర్తు రాలేదా? అని విఖ్యాత్‌ను కిషోర్ ప్రశ్నించారు. కట్టె కాలేంత వరకూ భూమా అనుచరులకు అండగా వుంటానని సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదని, వారి మర్యాదను కాపాడాలని తమ్ముడికి అన్న హితవు చెప్పారు. కనీసం ఒక్క పరువు నిలిపే పనైనా చేశావా? అని నిలదీశారు. తల్లిదండ్రుల పరువు బజారుకీడుస్తారా? అని మండిపడ్డారు. భూమా నాగిరెడ్డి , శోభా నాగిరెడ్డి వారసుడని చెప్పుకునే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.
మీ చర్యల వల్ల భూమా కార్యకర్తలు తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. దొంగలు పోతున్నారని ప్రత్యర్థులు అంటుంటే… ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. భూమా నాగిరెడ్డి దంపతులపై కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోకుంటే… అనుచరులు బట్టలు ఊడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు. ఈ పిటిషన్ అంతా ఫేక్ అని, ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.