వైసీపీకి శెల్యూట్ చేస్తామంటున్న అచ్చెన్న‌!

వైసీపీ స‌వాల్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ రాజీనామా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడు కూడా రాజీనామా…

వైసీపీ స‌వాల్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ రాజీనామా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడు కూడా రాజీనామా చేయాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. దీనిపై అచ్చెన్నాయుడు త‌న మార్క్ ప్ర‌తి స‌వాల్ విసిరారు.

రాజ‌ధాని అంశంపై మాట త‌ప్పింది, మ‌డ‌మ తిప్పింది వైసీపీనే అన్నారు. కావున ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. అమ‌రావ‌తే రాజ‌ధాని అని 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లామ‌న్నారు. అదే డిమాండ్‌తో 2024లో కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తామ‌న్నారు. ఇప్పుడు మాట మార్చిన సీఎం జ‌గ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం వుంటే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి, ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని స‌వాల్ విసిరారు.

ఒక‌వేళ వైసీపీ మూడు రాజ‌ధానుల వాద‌న‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డితే, తాము శెల్యూట్ చేస్తామ‌ని అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ లేదు, బొక్కా లేదనే వ్యాఖ్య‌ల‌తో బాగా పాపుల‌ర్ అయ్యారు. ఇప్పుడు శెల్యూట్ చేస్తామ‌నే కామెంట్‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఉత్త‌రాంధ్ర నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అచ్చెన్నాయుడిపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మ‌క డిమాండ్ చేసింది.

ఇందుకు దీటుగా అచ్చెన్నాయుడు కూడా కౌంట‌ర్ ఇచ్చారు. కేవ‌లం రాజ‌ధానిపై విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో మిగిలిన అంశాల‌న్నీ ప‌క్క‌కు పోయాయి. చివ‌రికి ఈ వివాదానికి ముగింపు ఎక్క‌డ ప‌లుకుతారో ఎవ‌రికీ అర్థం కాని ప్ర‌శ్న‌గా మిగిలింది. ఇక అచ్చెన్నాయుడి తాజా డిమాండ్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.