ఎవడు చెప్పాడ్రా విశాఖకు రాజధాని వద్దని….?

రాజసం మాకు వద్దు, మర్యాదకు మేము దూరం. దర్జా మాకు అసలే వద్దు ఎంతసేపూ మేము వేరే చోటకు రాజధాని పనుల కోసం పరిగెడుతూ ఉంటామని ఎవరైనా అంటారా. ఇంతటి తెలివితక్కువ ఆలోచనలు ఈ…

రాజసం మాకు వద్దు, మర్యాదకు మేము దూరం. దర్జా మాకు అసలే వద్దు ఎంతసేపూ మేము వేరే చోటకు రాజధాని పనుల కోసం పరిగెడుతూ ఉంటామని ఎవరైనా అంటారా. ఇంతటి తెలివితక్కువ ఆలోచనలు ఈ రోజుల్లో ఈ లోకంలో ఎవరైనా చేస్తారా. లడ్డూ కావాలా నాయనా అంటే వద్దు అనే ప్రబుద్ధుడు ఎక్కడైనా ఉంటాడా.

అసలు విశాఖ ఇప్పటికి 120 ఏళ్ల క్రితమే అతి పెద్ద జిల్లాగా బ్రిటిష్ వారి రోజులలో  అవతరించిది. బ్రిటిష్ వారు ఏపీలో నంబర్ వన్ సిటీగా చేసింది చూసింది విశాఖనే. విశాఖలో లేనిదేంటి అన్నట్లుగా నాడే రైల్వే ట్రాక్, పోర్టు, ఏయూ లాంటివి వచ్చాయి. తరువాత అనేక రకాలైన భారీ  పరిశ్రమలు వచ్చాయి.

అన్ని రకాలుగా విశాఖ నుంచి రవాణా అభివృద్ధి సాగుతుందని తెల్ల దొరలే భావించి ఎంచుకుంటే ఇపుడు విశాఖ రాజధానిగా వద్దు అంటున్న ప్రబుద్ధులకు చరిత్ర ఏ మాత్రం తెలియదు అనుకోవాలేమో. విశాఖ 1953లో రాజధాని కావాల్సి ఉంది. అది చరిత్ర పుటల్లో పదిలంగా ఉన్న మాట.

విశాఖ ఈ రోజున పాతిక లక్ష మందితో ఉన్న సిటీ. ఉమ్మడి విశాఖ జనాభా యాభై లక్షలు. ఉత్తరాంధ్రాను కలుపుకుంటే కోటికి తగ్గని జనాభా. విశాఖను రాజధానిని చేస్తే మరో హైదరాబాద్ అవుతుందని మేధావులు ఏనాడో చెప్పిన మాట. తెలంగాణా ఉద్యమకారులు కూడా ఏపీ విడిపోతే విశాఖను రాజధానిగా చేసుకోండి హైదరాబాద్ సరిసాటి సిటీతో మూడు పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ధి సాగుతుంది అని మాట వరసగా మంచి మాటగా ఎన్నో సార్లు చెప్పారు.

విశాఖలో ఉద్యమాలు లేవుట. విశాఖ వారికి రాజధాని వద్దుట. ఈ మాటలు ఎవరైనా చెప్పారా. విశాఖలో ఉంటున్న వారికి రాజధాని లేకపోతే భూ కబ్జాలు ఆగిపోతాయట. ప్రశాంతత వస్తుందట. మరి టీడీపీ ఏలుబడిలోనే కదా భూ కబ్జాలతో విశాఖ అట్టుడికింది. దాని మీద సిట్ కూడా ఆ ప్రభుత్వం వేసింది. మరి ఆనాడు ఏ రాజధానిగా ఉందని ఈ భూకబ్జాలు చేశారు.

ఎదుగుతున్న నగరంతో అన్నీ ఉంటాయి. దాన్నేదో బూచిగా చూపించి విశాఖకు రాజధాని వద్దు అని ఎవరైనా చెప్పారా. ఆ మాటకు వస్తే విశాఖ అభివృద్ధి అలా మెల్లగా సాగుతోంది. దాన్ని ఎవరైనా వద్దు అనుకుంటున్నారా. ఇవన్నీ లేకి మాటలు. ఇవన్నీ చేతకాని మాటలు అనే విశాఖలోని సగటు జనాలు అంటున్నారు.

విశాఖకు రాజధాని కోరిక లేకపోతే 2014లో మాకే రాజధాని కావాలని సంతకాల సేకరణ ఎందుకు చేపడతారు. విశాఖ విషయంలో విషం కక్కుతున్న వారు ఇంకా రూపూ షేపూ లేని అమరావతి కోసం గగ్గోలు పెడుతున్నారు అంటే దాని వెనక పక్కా రాజకీయాలే ఉన్నాయని అన్నది అందరి మాట. విశాఖ జనాలు రోడ్ల మీదకు రాలేకపోవచ్చు. ఉద్యమాలు పాదయాత్ర‌లు చేయలేకపోవచ్చు. మీసాలు మెలేసి తొడలు కొట్టకపోవచ్చు.

కానీ విశాఖకు రాజధాని కావాలన్నది లక్షలాది మంది జనం కోరిక. రాజధాని వస్తే వెనకబడిన ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం జిలాలలో వలసలు ఆగిపోతాయి. గోదావరి జిల్లాల దాకా అందరికీ మేలు జరుగుతుంది అన్నది మేధావుల మాట. అన్ని జిల్లాలలో తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు భోగాపురంలో వస్తున్న వేళ ఏపీకి అన్ని విధాలుగా సూటబుల్ క్యాపిటల్ విశాఖ మాత్రమే.

విశాఖ రాజధాని అయితే కేవలం ఉత్తరాంధ్రాకే కాదు ఏపీకి కూడా ఎంతో లాభం. పదేళ్లలో ఏపీ ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరిగి ముందు వరసలోకి వస్తుంది. అందువల్ల విశాఖ రాజధానిని ఎవరూ కోరుకోవడం లేదని పదే పదే చెప్పే పాచి కబుర్లు, చిలక జోస్యాలు ఇక మీదట మానేయడం మంచిది. విశాఖ రాజధాని వద్దు అనే వారు వారి మాటగానే దానిని చెప్పండి. తప్ప లక్షలాది జనాల మాటగా వారి మనసులో దూరి చెబుతున్నట్లుగా చెబితే మాత్రం బాగోదు అన్న‌దే విశాఖ జన మనోగతం.