తాలిబన్ల వశమైన అప్గాన్ దేశస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తమ బతుకులు గాలిలో దీపమయ్యా యనే ఆందోళన వారిలో కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో బతుకుపై భరోసా కలిగించే శుభవార్త తాలిబన్ల నుంచి వచ్చింది. అప్గానిస్తాన్ను సొంతం చేసుకున్న తాలిబన్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. అప్గానిస్తాన్ వాసులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
‘ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి తప్పనిసరిగా విధుల్లో చేరండి. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తించండి’ అని తాలిబన్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాలిబన్ల గతానుభవాలు కళ్ల ముందు కదలాడుతుండడంతో, వారి ప్రకటనపై ఇంకా నమ్మకం కలగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్గాన్ ఎప్పుడైతే తాలిబన్ల వశమైందో, ఆ క్షణం నుంచి చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా జనం ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు విమానం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయిన దృ శ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ల నుంచి ప్రజలు ఆశిస్తున్న విధంగా… ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ప్రకటన రావడం ఒకింత విస్మయానికి గురి చేస్తోంది.
నరరూప రాక్షసులుగా పేరొందిన తాలిబన్లు శాంతి వచనాలు జపించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది తాలిబన్ల వ్యూహంలో భాగమా? లేక నిజంగానే వారిలో పరివర్తన వచ్చిందా? …ఇలా అనేక ప్రశ్నలు అప్గాన్లతో పాటు ప్రపంచ పౌరుల మెదళ్లను తొలుప్తున్నాయి.
మరోవైపు తాలిబన్ల నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో ఆ దేశంలో మామూలు పరిస్థితులు నెల కుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. కూరగాయలు, నిత్యావసర సరుకులు, మందుల దుకాణాలు తెరచుకుంటున్నట్టు సమాచారం వస్తోంది. ఇదే నిజమైతే అప్గాన్ల ఆనందానికి హద్దు ఏముంటుంది?