ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక దేశం మొత్తాన్ని ఆకర్షించగలదా? అలా ఆకర్షించే ఉప ఎన్నికలుంటాయి. కాకపొతే ఆ ఉపఎన్నికలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన నాయకులు ఉండాలి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికకు దేశమంతా ఆకర్షించే లక్షణాలు ఏమీ లేకపోయినా అంతటి సీన్ క్రియేట్ చేస్తోందని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ ఇంతటి హడావుడి, ఇంతటి ప్రచార ఆర్భాటం, ఇంతటి విమర్శలు ప్రతి విమర్శలు, ఇంతటి యుద్ధ వాతావరణం ఏ ఉప ఎన్నికలోనూ కనబడలేదు.
కాంగ్రెస్ దిగ్గజం జానా రెడ్డి పోటీ చేసిన నాగార్జున సాగర్ లోనూ కేసీఆర్ ఇంతగనం శ్రమపడలేదు. కానీ కేసీఆర్ హుజారాబాద్ ఉప ఎన్నికను చావో రేవో అన్నట్లుగా తీసుకున్నారు. ఇది ఉప ఎన్నిక కాదు, అసెంబ్లీ ఎన్నికలు అన్నట్లుగా ఆయన భావిస్తున్నారు. ఆయన తపన చూస్తుంటే, ఆయన కసి చూస్తుంటే ముఖ్యమంత్రిగా కాకుండా ఒక సాధారణ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులకు, కేసీఆర్ కు తేడా లేకుండా పోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రతిపక్ష నాయకులు చెమటోడుస్తున్నారంటే దానికో అర్థముంది. ఒక్క సీటు అయినా తమ ఖాతాలో పడుతుందని ఆశ పడతారు. కానీ కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారు ? సపోజ్ …హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓడిపోయారనుకుందాం. కేసీఆర్ అధికారమైతే పోదు. అది ఆయనకూ తెలుసు. ఇక్కడ ఉప ఎన్నికలో గెలవడం కంటే ఈటల రాజేందర్ మీద పగ తీర్చుకోవాలని బలమైన కోరిక కారణంగానే కేసీఆర్ ఎన్నిరకాల గిమ్మిక్కులు చేయాలో అన్ని రకాల గిమ్మిక్కులు చేస్తున్నారు.
హుజూరాబాద్ బాధ్యతలు అప్పగించిన మంత్రి హరీష్ రావు మీద కూడా నమ్మకం లేనట్లుగా ఉంది. ఇతర మంత్రులను కూడా కేసీఆర్ నమ్మడంలేదు. నమ్మడంలేదు అనడం కంటే ఆయనలో విపరీతమైన భయం గూడు కట్టుకుందని చెప్పొచ్చు. నిజానికి దళిత బంధు పథకానికి చేసినంత ప్రచారం గతంలో ఏ పథకానికి చేయలేదని చెప్పొచ్చు.
ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి బ్రహ్మాండమైన పథకం లేదని కేసీఆర్ అండ్ టీమ్ చేస్తున్న ప్రచారం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్క హుజూరాబాదుకు పరిమితమయ్యే దళితబంధు కోసం అంత పెద్ద సభ అవసరమా ? చివరకు కేసీఆర్ ఎంతకు దిగజారిపోయారంటే … దళిత ప్రభుత్వ ఉద్యోగులకు సైతం దళితబంధు అమలు చేస్తానని చెప్పారు.
ప్రతి నెలా వేల రూపాయలు జీతాలు తీసుకునే దళిత ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇస్తానని చెప్పడమేమిటి ? ఉచితంగా డబ్బులు పంచే పథకాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకంగా ప్రచారం చేయడమేమిటి ? త్వరలో హుజూరాబాద్ లో మండలాల వారీగా పర్యటిస్తానని చెప్పడం ఆయన భయాన్ని స్పష్టంగా తెలియచేస్తోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు దళితుల అభ్యున్నతి కోసం ఎవరూ ఆలోచించలేదు అని కేసీఆర్ అనడం హాస్యాస్పదమే. ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలన్నీ దళితుల అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చాయని చెప్పక తప్పదు. కాస్త ఎక్కువ, తక్కువగా అన్ని ప్రభుత్వాలు వారికోసం పని చేశాయి. కానీ కేసీఆర్ మాత్రం అంబెడ్కర్ తరువాత తానే అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
దళితుల కోసం పాటుపడింది ఇద్దరేనని ఆనాడు అంబెడ్కర్ దళితుల గురించి ఆలోచిస్తే ..మళ్ళీ ఈనాడు కేసీఆర్ ఆ పని చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశాడు కూడా. బ్యాంకుల జాతీయకరణ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఫీజ్ రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పెద్ద ఎత్తున జరిగిన భూపంపిణీ …ఇలా అనేక పథకాలు దళిత బహుజనులకు మేలు చేశాయి.
ఓటు బ్యాంకు పాలిటిక్స్ లో భాగంగా డబ్బులు పంచి ఇదే దళితుల ఉద్ధరణ అని చెప్పడం కేసీఆర్ కే చెల్లింది. దీని అర్థం దళితులు ఎప్పటికీ పాలకుల మీద ఆధారపడాలనే చెప్పినట్లుగా ఉంది. వారికి మంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు భూపంపిణీ చేయాలి. కానీ డబ్బు పంచడం ఎప్పటికీ సరైన విధానం కాదు.