అంతా అనుకున్నట్టే అయింది. ఏపీలో స్కూల్స్ తెరిస్తే మళ్లీ కరోనా కేసులు పెరిగితే ఎలా అనే అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే దాదాపుగా పిల్లలెవరూ స్కూల్ కి హాజరు కాలేని పరిస్థితి.
అవ్వ, తాతలు ఉన్నవారిని స్కూల్స్ కి రావద్దంటున్నారు. ఆటోలు, రిక్షాల్లో ఎక్కి స్కూల్ కి వచ్చేవారికి నో ఎంట్రీ అంటున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు స్కూల్ వ్యాన్స్ ని రోడ్లపైకి తెచ్చే పరిస్థితే లేదు. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతో గతంలోలాగే స్కూల్ వ్యాన్లు ఏవీ పిల్లల కోసం ఇకపై బయటకు రావు అని తేలిపోయింది. దీంతో తల్లిదండ్రులంతా వ్యక్తిగత వాహనాలను వినియోగించక తప్పని పరిస్థితి.
10 శాతం కంటే కేసులు పెరిగితే స్కూల్స్ రద్దు..
రాష్ట్రవ్యాప్తంగా 10శాతం కంటే తక్కువ కేసులున్న ప్రాంతంలోనే స్కూల్స్ రీఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అన్ని చోట్లా కేసులు తక్కువగానే ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాల్లోనూ స్కూల్స్ తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. అయితే ఎక్కడైనా కేసుల సంఖ్య 10శాతం కంటే పెరిగితే వెంటనే స్కూల్స్ మూసివేయాల్సిందే.
తరగతి గదికి కేవలం 20మంది మాత్రమే అనే నిబంధన కూడా కాస్త ఇబ్బంది కరమే. ప్రభత్వ స్కూల్స్ అయినా, ప్రైవేట్ స్కూల్స్ అయినా ఒక్కో తరగతికి గరిష్టంగా 120మంది ఉండే పరిస్థితి చాలా చోట్ల ఉంది. అలాంటి స్కూల్స్ లో ఆ తరగతి కోసమే 6 గదులు కేటాయించాలి. లేకపోతే 6,7 తరగతులకు ఒకరోజు, 8,9,10 తరగతులకు మరొకరోజు స్కూల్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయులకు కత్తిమీద సామే..
విద్యార్థులు స్కూల్స్ లో పెన్నులు, పేపర్లు, పుస్తకాలు, వాటర్ బాటిల్స్ మార్చుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ప్రతి రోజూ అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ప్రతి వారం ర్యాండమ్ గా ఇద్దరు స్టూడెంట్స్ కి, ఒక టీచర్ కి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించాలి. వారికి పాజిటివ్ వస్తే స్కూల్ మొత్తం పరీక్షలు చేయించాల్సిందే. మధ్యాహ్న భోజనం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
మొత్తమ్మీద ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం సాహసించినా.. సవాలక్ష కండిషన్లు పెట్టి ముందు జాగ్రత్తలు బాగానే తీసుకుంది. అయితే ఇప్పుడీ నియమాలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహించడం ఉపాధ్యాయులకు పెద్ద భారంగా మారేలా ఉంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఈ విషయంలో ఆలోచనలో ఉన్నా.. ఏపీ సర్కారు తీసుకున్న డేరింగ్ డెసిషన్ ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.