అవునన్నా, కాదన్నా చంద్రబాబు తర్వాత నారా లోకేశే టీడీపీకి పెద్ద దిక్కు. లోకేశ్‌కు నాయకత్వ సమర్థత ఉందా? లేదా? అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే ఆయనకు అంత సీన్ లేదనేది జగమెరిగిన సత్యం. సూర్యుడి లాంటి తండ్రి చంద్రబాబు వెలుగులో లోకేశ్ ప్రభ పగటి వేళ చంద్రుడిని తలపిస్తోందనే సొంత పార్టీ నేతలు అంటుంటారు. కానీ మంగళగిరిలో ఓటమితో లోకేశ్ నాయకత్వ సమర్థతపై మచ్చ పడింది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అవి రెండూ శాశ్వతం కాదు. నేతల్లో పట్టుదలను బట్టి గెలుపోటములు మారుతూ వుంటాయి. ఓటమి పునాదిపై గెలుపు సౌధాన్ని నిర్మించుకుని ఆదర్శ నాయకులుగా చరిత్రకెక్కిన వాళ్లను స్ఫూర్తిగా చెప్పుకుంటుంటాం. అదేంటో గానీ, తండ్రి చంద్రబాబు పట్టుదల లోకేశ్‌లో పదో వంతు కూడా కనిపించదు. మంగళగిరిలో తన ఓటమి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం తర్వాత కూడా ఆయనలో మార్పు రాకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది.
పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని 70 ఏళ్లు పైబడిన వయసులోనూ చంద్రబాబు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ లోకేశ్ మాత్రం యాక్టీవ్‌గా కనిపించడం లేదు. సంక్రాంతి తర్వాత పాదయాత్ర చేస్తారని చెబుతున్నారు. మొదట దసరా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అకస్మాత్తుగా సంక్రాంతికి ముహూర్తం ఎందుకు మారిందో తెలియదు. అప్పుడైనా వుంటుందా? అంటే అనుమానమే అని చెప్పక తప్పదు. లోకేశ్ పాదయాత్ర చేస్తే… పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని సీనియర్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతసేపూ ప్రత్యర్థులపై ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తూ, పోస్టులు పెట్టడం తప్ప నేరుగా రంగంలోకి దిగి పార్టీ శ్రేణులకు లోకేశ్ భరోసా ఇవ్వడం లేదనే విమర్శ బలంగా ఉంది. దాని నుంచి బయటపడేందుకు, లోకేశ్ తన బలహీనతల్ని అధిగమించే ప్రయత్నం చేయడం లేదు. సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టడం, అనుకూల పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతోనే టీడీపీకి రాజకీయంగా అనుకూల వాతావరణం ఏర్పడుతోందన్న భ్రమలో లోకేశ్ ఉన్నారు. మొదట ఆ భ్రమ నుంచి లోకేశ్ బయటపడాలి.
ఇటీవల కుప్పం ఘటనలో అరెస్ట్ అయి చిత్తూరు జైల్లో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తల్ని లోకేశ్ పరామర్శించారు. ఇలాంటివి లోకేశ్ నుంచి పెరగాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అప్పుడే నాయకుడిగా లోకేశ్ తనను తాను నిరూపించుకుంటారు. వైసీపీ పాలనపై ట్వీట్‌తో సరిపెడితే లాభం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంత వరకూ లోకేశ్ చేస్తున్న పని ఇదే. కనీసం ఎన్నికల ముంగిట అయినా లోకేశ్ కార్యక్షేత్రంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది.
వీరుడినే విజయం వరిస్తుందని లోకేశ్ గ్రహించాలి. అందుకే ఎన్నికల రణరంగంలో తలపడే సైనికుడిగా లోకేశ్ తయారవ్వాలి. ట్వీట్లతో సరిపెడితే కుదరదు. ఫైట్ చేయాలి. ఆ ఫైర్ తనలో ఉందని లోకేశ్ నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. లోకేశ్ భవిష్యత్ తేల్చడానికి కాలం ఎదురు చూస్తోంది.