ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి హ్యాకర్లు షాక్ ఇచ్చారు. టీడీపీ అఫీషియల్ ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. టీడీపీ ట్విటర్ హ్యాండిల్ స్థానంలో “టైలర్ హాబ్స్” అనే పేరు ప్రత్యక్షమైంది. హ్యాక్‌కు గురైన అకౌంట్లో టీడీపీకి సంబంధించిన సమాచారం కాకుండా, విజువల్ అర్ట్స్కు సంబంధించిన పోస్టులు కనిపించాయి.
దీంతో పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్టు ఆ పార్టీ సాంకేతిక నిపుణులు గుర్తించారు. గతంలో కూడా ఈ ట్విటర్ ఖాతా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా హ్యాకర్ల బారి నుంచి రక్షించుకునేందుకు టీడీపీ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. కొంత సమయానికే తిరిగి యధావిధిగా ట్విటర్ ఖాతాను పునరుద్ధరించారు.
తెలుగుదేశం అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్‌కు గురి కావడం రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనుక వైసీపీ శక్తులున్నాయని టీడీపీ సాంకేతిక నిపుణులు ఆరోపిస్తున్నారు. టీడీపీని అప్రతిష్టపాలు చేసే కుట్రలో భాగంగా ఇలాంటి చర్యలకు దిగారని వారు మండిపడుతున్నారు.
టీడీపీ ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఇలాంటి పనులు చేయడంలో టీడీపీ పేటెంట్ కలిగి వుందని గట్టి కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయాల్సిన అవసరం తమకేంటని వారు ప్రశ్నిస్తున్నారు.