కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నికల బరిలో ఇద్దరే మిగిలారు. ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం వీరిద్దరి నామినేషన్లు చెల్లుబాటులో ఉన్నాయని ఎన్నికల కమిటీ ప్రకటించింది. వీరితో పాటు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో.. అధ్యక్ష ఎన్నిక ద్వంద్వ పోరుగా నిలుస్తోంది.
అక్టోబర్ 17వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. మరి ఖర్గే, థరూర్ లలో విజయం ఎవరిని వరిస్తుందో అనేది ఆసక్తిదాయకమైన అంశం. అయితే అంతలోపు నామినేషన్ల విత్ డ్రా అవకాశాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ తొమ్మిదో తేదీలోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది ఎన్నికల కమిటీ. అయితే ఈ ఇద్దరు నేతల్లో ఎవరూ విత్ డ్రా చేసుకునే అవకాశాలు లేకపోవచ్చు. దీంతో పోలింగ్ దాదాపు ఖాయం అయినట్టే!
ఇక ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా కూడా చేసేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాకు రాజీనామా చేసి ఖర్గే కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవి బరిలో నిలిచారు. తద్వారా.. ఆయన విజయం పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తం చేయకుండానే చేసినట్టుగా అయ్యింది. ఇక మల్లిఖార్జున ఖర్గేతో పాటు తను బరిలో నిలవడం పట్ల శశిథరూర్ సానుకూలంగా స్పందించారు. ఆయనతో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అన్నట్టుగా మాట్లాడారు.
మల్లిఖార్జున ఖర్గేకే సోనియాగాంధీ, రాహుల్ ల మద్దతు ఉందనే ప్రచారం అయితే ఒకటి జరుగుతోంది. అధికారికంగా ఏ ప్రకటనా లేకపోయినా.. విధేయత దృష్ట్యా ఖర్గేకే సోనియా మద్దతు ఉండవచ్చనే ప్రచారం సాగుతూ ఉంది.