చిత్రం: పొన్నియన్ సెల్వన్-1
రేటింగ్: 2.25/5
తారాగణం: విక్రం, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, శరత్ కుమార్, పార్తిబన్, రెహ్మాన్, ప్రకాష్ రాజ్, జయరాం తదితరులు
కథ: కల్కి కృష్ణమూర్తి
మాటలు: తనికెళ్ల భరణి
కెమెరా: రవి వర్మన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: ఎ.ఆర్.రెహ్మాన్
నిర్మాత: మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరజ
దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ: 30 సెప్టెంబర్ 2022
1950-54 మధ్య కల్కి అనే తమిళ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన కృష్ణమూర్తి రాసిన నవల ఇది. తర్వాత దాన్ని అచ్చువేసి నవలగా అమ్మితే లక్షలాది కాపీలు దశాబ్దాల తరబడి అమ్ముడుపోయాయి. కల్కి పత్రికలో రాసి ఫేమస్ అయినందువల్ల రచయిత పేరు కల్కి కృష్ణమూర్తిగా స్థిరపడిపోయింది.
ఇది ఆధునిక తమిళ సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే చారిత్రాత్మక గాధ. అసలు కథకి కొన్ని కల్పనలు అద్ది 50 కి పై చిలుకు ప్రధాన పాత్రలతో ఉత్కంఠభరితంగా మలిచిన 2000 పైచిలుకు పేజీల నవల ఇది.
ఎప్పటి నుంచో సినిమాగా తీసే వీలున్నా అన్నేసి పాత్రలతో సినిమా తీసే వ్యయప్రయాసలకు బెదిరి ఇంతవరకూ ఎవ్వరూ ముట్టుకోలేదు. కానీ భారీ బడ్జెట్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి ఫలితాన్ని చూసాక ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం కలిగింది మణిరత్నం బృందానికి.
బాహుబలి కథకి కూడా ఈ పొన్నియన్ సెల్వం లో కొన్ని మూలాలు కనిపిస్తాయి. కథగా పొన్నియన్ సెల్వన్ బాహుబలికి కొంతవరకు స్ఫూర్తి అనుకుంటే, సినిమాగా తయారవడానికి మాత్రం బాహుబలే పొన్నియన్ సెల్వన్ కి స్ఫూర్తి.
ఇంతకీ పొన్నియన్ సెల్వన్ అంటే కావేరీపుత్రుడు అని అర్థం. కావేరీ నది ఒడ్డున ఉన్న చోళరాజులందరూ పొన్నియన్ సెల్వన్ లే. కానీ ఆ పేరు రాజరాజచోళుడికే స్థిరపడిపోయింది. ఆ రాజరాజచోళుడే ఈ నవలానాయకుడు. అతని అసలు పేరు అరుళ్ మొళి. అతనే పొన్నియన్ సెల్వన్. జయం రవి పోషించిన పాత్ర అదే.
ఈ అరుళ్ మొళికి (జయం రవి) ఒక అక్క కుందవి(త్రిష), ఆ పైన ఒక అన్న ఆదిత్య కరికాలన్ (విక్రం) ఉంటారు. ఆదిత్య మహాయోధుడు. కుందవి రాజతంత్రం తెలిసిన తెలివైన యువరాణి. ఈ ముగ్గురికి తండ్రి సుందర చోళుడు (ప్రకాష్ రాజ్).
ఆదిత్య కి చిన్ననాటి ప్రేమికురాలు నందిని (ఐష్వర్యా రాయ్). ఇద్దరికీ కొన్ని కారణాల వలన వివాహం జరగదు. కానీ ఆమె అదే రాజ్యంలో వయసులో తనకన్నా చాలా పెద్దవాడైనా ఆర్థికమంత్రిని (శరత్ కుమార్) పెళ్లి చేసుకుని కొంత స్థాయిని పొందుతుంది. ఆమెది ఒక రకంగా విలన్ పాత్ర. చోళ సింహాసనం మీద ఆమెకి కన్నుంటుంది. అది ఒక సన్నివేశంలో దర్శకుడు సింబాలిక్ గా చూపించాడు. ఆ సింహాసనాన్ని పొందడానికి తనకున్న అడ్డంకులు తొలగించుకోవాలనే ఆలోచనలో ఆమె ఉందని ప్రేక్షకుడికి అనిపిస్తుంది.
ఈ మాత్రం కథ చెప్పుకోకపోతే చూస్తున్నప్పుడు చాలామందికి అర్థం కాకపోవడానికే అవకాశమెక్కువ. పైగా ఈ కథ తెలిస్తేనే చూసేటప్పుడు మెదడుకి తక్కువ పని పడుతుంది. ఇంతవరకూ కథలోని సస్పెన్సులేవీ రివీల్ చేయలేదు. అన్నీ పార్ట్ 2 లోనే.
ఈ కథలోని తమిళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎవరు ఎవరికి ఏమౌతారు, ఎవరి బంధుత్వాలు ఏవిటి అనేది అర్థం కావటానికే సమయం తీసుకుంటే కొన్ని ప్రధాన పాత్రలకి అసలు నామం కాసేపు, బిరుదు కాసేపు వాడుతుండడం మెదడుకి మరింత పని పెడుతుంది.
మహాభారతంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయో ఈ నవలలో కూడా అంతే. ఎవరు ఎవరికి శత్రువో, ఎవరి ఎత్తుగడ దేని కొసమో అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. 9 వ శతాబ్దం నాటి ఈ కథని తెరమీద అత్యంత భారీగా చూపించారు. చూస్తున్నంతసేపూ విజువల్ గా శతాబ్దాల నాటి ప్రపంచంలో ఉన్న అనుభూతి వస్తుంది. ప్రతి చిన్న డీటైల్ ని చక్కగా మలిచారు. పడవలు తెరచేపాలు ఎత్తడం, దించడం దగ్గర్నుంచి ఏనుగు సవారీలు, గుర్రపు స్వారీలకు సంబంధించిన మైన్యూట్ డీటైలింగ్ కూడా చేయడం ప్రశంసార్హం. చాలాకాలం తర్వాత తెరమీద అత్యంత ఖరీదైన సినిమా చూస్తున్న ఫీలింగొస్తుంది. కారణం విజువల్ ఎఫెక్ట్స్ కొంత, తారాగణం ఇంకొంత.
మణిరత్నం, రెహ్మాన్ కాంబినేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన బ్లెండ్ అది. ఒక తరంలో ఒక ఊపు ఊపినా ప్రస్తుతం ఎ.ఆర్.రెహ్మాన్ ఆకట్టుకోవడంలో చాలా వెనుకబడ్డాడని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కీరవాణి, దేవీశ్రీప్రసాద్, తమన్ లు ఈ మధ్యన చేస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పోల్చి చూస్తే రెహ్మాన్ చిన్నగా కనిపిస్తున్నాడు. ఎక్కడా ఉత్కంఠని కలుగచేసే నేపథ్యసంగీతం వినపడలేదు. అత్యంత సాధారణంగా ఉంది. ఇక పాటలైతే దారుణం. అరవపాటకీ తెలుగుపాటకీ పెద్ద తేడా వినిపించలేదు. అదెంత అర్థమౌతుందో ఇదీ అంతే అన్నట్టుంది. చెవులు రెక్కించుకుని నొసట్లు చిట్లించి పాటలో ఎముందో శ్రద్ధగా వింటే కొన్ని పదాలు బోధపడవచ్చేమో కానీ అలవోకగా మాత్రం చెవుల్ని, మనసుని చేరవు. ఈ పరిస్థితికి డబ్బింగ్ సమస్యతో పాటూ సంగీతలోపం, “మెత్తని” లాంటి పదాల్ని “మెత్ హాని” అని పలికిన గాయకుల లోపం కూడా కొంత కారణం.
టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, మేకప్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ కి నూటికి నూరు మార్కులేయొచ్చు. ఎక్కడా వంకలు కనపడవు.
సంభాషణల విషయానికొస్తే మాటి మాటికీ ధ్వనించే అరవ పేర్ల వల్ల ఇబ్బందిగా ఉంటుంది కానీ, తనికెళ్ల భరణి కలం చాలా గ్యాప్ తర్వాత బాగానే పలికింది. డబ్బింగ్ కనుక లిప్ సింక్ కి బాగా ప్రాధాన్యతిచ్చి శ్రద్ధగా రాసినట్టున్నాయి పదాలు. ముఖ్యంగా “మట్టికి తలవంచిన వాడు ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతాడు” లాంటి లైన్స్ కొన్ని గుర్తుండేలా ఉన్నాయి. అలాగే కార్తికి, ఐశ్వర్యారాయ్ కి మధ్యన జరిగే సంభాషణ ఆకట్టుకుంటుంది. తనికెళ్ళ భరణి డబ్బింగ్ చెప్పడం వల్ల నంబి పాత్ర ఒక్కటీ తెలుగు నేటివిటీకి దగ్గరగా అనిపించింది. అయితే ఒకచోట శోభితా ధూళిపాళ పాత్ర త్రిషని “అక్కా!” అని సంబోధించడం వల్ల వరసలు మారిపోయి అసలే అర్థం కాని పాత్రల్ని మరింత అయోమయంలోకి నెడుతుంది. ఇటువంటి విషయాల్లో భరణి లాంటి సీనియర్ రచయిత జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.
యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ ఎంత బాగున్నా బాహుబలిలో ఆ స్థాయి సన్నివేశాలు చూసేయడం వల్ల కొత్త అనుభూతి కలుగదు. క్లైమాక్స్ లో వచ్చే నౌకాయుద్ధం మాత్రం బాగుంది.
కథ కొంత వరకూ తెలుసుకుని సినిమా చూస్తే పర్వాలేదు కానీ లేకపోతే గందరగోళంగానే అనిపిస్తుంది. అయితే చెప్పాల్సిన అసలు కథంతా సెకండ్ పార్ట్ కి దాచేసుకుని ఈ ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రలు, వారి ఉద్దేశ్యాల పరిచయం అన్నట్టుగా చూపించి ఆపేసారు. నాజర్ పాత్ర ఏవిటో కనీసం అర్థం కాకుండా వదిలేసారు. అది సెకండ్ పార్ట్ ఫ్లాష్ బ్యాకులో తెలుసుకోవాలేమో. సినిమా అంతా చూసాక కూడా ఒక ప్రధాన పాత్రది డబల్ యాక్షన్ అని ఎంతమందికి అర్థమయ్యిందో డౌటే. పైగా ముగింపు కూడా అత్యంత పేలవంగా ఉంది. “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” లాంటి ప్రశ్న లేకుండా ముగియడం ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్. అది సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెంచడానికి అవరోధంలా ఉంది.
క్రీం బిస్కెట్ ని రెండు రకాలుగా విడగొట్టొచ్చు. రెండుగా విడగొట్టడం, మధ్యలోకి తుంపడం.
పిల్లలందరూ చేసే పని రెండుగా విడగొట్టడం. అలా విడగొట్టినప్పుడు ఒకదానికి క్రీము మొత్తం అంటుకుని రెండో దానికి ఏమీ అంటకుండా మిగిలిపోతుంది. అలా క్రీము అంటని బిస్కెట్ ముక్కలాగ మిగిలిపోయింది ఈ పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్టు.
అలా కాకుండా మధ్యకి తుంపి ఉంటే రెండు భాగాల్లోనూ క్రీముండేది..బాహుబలి మాదిరిగా!
కనీసం పొన్నియన్ సెల్వన్ రెండో భాగంలోనైనా మిస్సైన క్రీముంటుందని ఆశిద్దాం.
బాటం లైన్: అర్థం కాని అద్భుతం