టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొని, తొలి సారి సెమిస్ వరకూ చేరి సంచలనం రేపిన భారత మహిళా హాకీ జట్టులోని సభ్యురాలు, తెలుగమ్మాయి రజనీకి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజనీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు ప్రోత్సహకాల విషయంలో ఆమెకు జగన్ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
రజనీకి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దాంతో పాటు ఆమె కోరుకున్నట్టుగా తిరుపతిలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. నెలకు 40 వేల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా అధికారులను జగన్ ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో రజనీకి ప్రకటించిన ప్రోత్సహకాలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. వాటిని సత్వరం కేటాయించాలని కూడా జగన్ అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం.
భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్ లో ఎలాంటి పతకం సాధించలేదు కానీ, స్ఫూర్తిమంతమైన పోరాటాన్ని అయితే చూపించింది. అసలు ఇండియాలో స్పోర్ట్స్ కే ఏ మాత్రం ప్రోత్సాహం లేదు. అందులోనూ అమ్మాయిలు.. ఆపై హాకీ అంటే.. దానికి ఉండే ప్రోత్సాహం ఎంతో చెప్పనక్కర్లేదు.
ఒకవైపు పతాకధారులపై కోట్ల రూపాయల వర్షం కురుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో.. సెమిస్ వరకూ చేరి, ఉనికిని చాటిన మహిళా హాకీ ప్లేయర్లను సహజంగానే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పురుషుల హాకీ టీమ్ కు అయినా పలువురు ప్రైజ్ మనీలు ప్రకటించారు కానీ, మహిళల హకీ టీమ్ కు ఆ తరహా ప్రైజ్ మనీలు కూడా ఏవీ లేవు. ఇలాంటి నేపథ్యంలో.. ఒక తెలుగు మహిళా హకీ ప్లేయర్ కు ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం సమంజసమే. అభినందనీయం.