నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్ లో గాయపడ్డారు. చెన్నైలో ఓ తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రకాష్ రాజ్, ఫ్లోర్ పై జారిపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే దెబ్బలు మాత్రం కావు. ఆయనకు సర్జరీ చేయాల్సిందే.
ప్రకాష్ రాజ్ ను చెన్నై నుంచి హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ కు తరలించారు. తనకు చిన్న సర్జరీ జరగబోతోందనే విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, చిన్న గాయమేనని అంటున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ప్రకాష్ రాజ్. ఈ మేరకు ఆయన తన ప్యానెల్ ను కూడా గ్రాండ్ గా ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన వివాదాలు, సంచలన ఆరోపణల మధ్య.. ఇక అసోసియేషన్ ఎన్నికల గురించి తను మాట్లాడనని స్పష్టంచేశారు.
అలా ఎన్నికల అంశాన్ని పక్కనపెట్టి, సినిమాలతో బిజీ అయిన ప్రకాష్ రాజ్, ఇప్పుడిలా గాయాల పాలై మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజా సమాచారం ప్రకారం, సర్జరీ తర్వాత ప్రకాష్ రాజ్ 2 వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందట.