చెత్త సినిమాలకు కులమే కారణమని కోలీవుడ్ నటి మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరా మిథున్ కులంహకా రంపై నెటిజన్లు, దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక యుగంలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో ఓ సెలబ్రిటీ నుంచి ఇలాంటి కులదూషణ మాటలు రావడంపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తమవుతోంది. చిత్రపరిశ్రమలో దుమారం రేపుతున్న మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలేంటో తెలుసుకుందాం.
దళిత కులానికి చెందిన దర్శకులు, నటీనటుల వల్లే సినీ ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, అలాంటి దళితులను చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మీరా మిథున్ ఆగ్రహానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. ఇటీవల ఆమె అనుమతి లేకుండా ఓ దర్శకుడు ఫొటోను వాడుకున్నాడు. ఇది ఆమెకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
ఓ ఇంటర్వ్యూలో దళితులపై చేసిన ఈ సంచలన కామెంట్స్ కోలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాల వాళ్ల వల్లే చెత్త సినిమాలొస్తున్నాయని ఆమె పునరుద్ఘాటించారు. వారి పద్ధతులు కూడా బాగుండవని ఆమె తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
పరిశ్రమలోని దళిత దర్శకులు, నటీనటులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి నేరాలతో సంబంధం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మీరా మిథున్ అభ్యంతర కామెంట్స్‌పై దళిత సంఘాలు మండిపడుతున్నారు.
ఆమె క్షమాపణ చెప్పడంతో పాటు తన అభిప్రాయాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దళిత సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరా మిధున్‌పై పలుచోట్ల కేసులు నమోదు కావడం …పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.