బావ క‌ళ్ల‌ల్లో ఆనందం, తండ్రి క‌ళ్ల‌ల్లో క‌న్నీళ్లు!

హెల్త్ యూనివ‌ర్సిటీకి త‌న తండ్రి ఎన్టీఆర్ పేరు తొల‌గింపు, అలాగే వైఎస్సార్ పేరు పెట్ట‌డంపై నంద‌మూరి బాల‌కృష్ణ ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థులు కూడా అదే స్థాయిలో స‌మాధానం ఇస్తున్నారు.  Advertisement మాజీ మంత్రి,…

హెల్త్ యూనివ‌ర్సిటీకి త‌న తండ్రి ఎన్టీఆర్ పేరు తొల‌గింపు, అలాగే వైఎస్సార్ పేరు పెట్ట‌డంపై నంద‌మూరి బాల‌కృష్ణ ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థులు కూడా అదే స్థాయిలో స‌మాధానం ఇస్తున్నారు. 

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ బాల‌య్య‌పై విరుచుకుప‌డ్డారు. ప‌నిలో ప‌నిగా నంద‌మూరి కుటుంబ స‌భ్యుల్ని కూడా విడిచిపెట్ట‌లేదు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన‌పుడు క‌నీసం హ‌ర్షం వ్య‌క్తం చేశారా? అని బాల‌య్య‌ను వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడ‌వ‌డంలో బావ చంద్ర‌బాబుతో పాటు కుమారుడైన నంద‌మూరి బాల‌కృష్ణ కూడా భాగం పంచుకు న్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. నాడు సోకాల్డ్ నంద‌మూరి వంశ‌స్తులంతా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేదా అని నిల‌దీశారు. బావ చంద్ర‌బాబు క‌ళ్ల‌ల్లో ఆనందం, తండ్రి ఎన్టీఆర్ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు చూసిన వ్య‌క్తి బాల‌కృష్ణ అని తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

సాధార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కొడుకులు బాగా చూసుకుంటార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కానీ ఇక్క‌డ బావ‌ను బాగా చూసుకున్నారని దెప్పి పొడిచారు. ఇప్పుడు మాట్లాడుతున్న నంద‌మూరి వార‌సులంతా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర బానిస‌ల్లా, కుక్క‌ల్లా ప‌ని చేస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. బాల‌య్య త‌న స్వార్థం కోసం తండ్రి ఎన్టీఆర్‌కు అన్యాయం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.