అధికారంలో ఉండే పార్టీలో గ్రూపులు ఉండడం చాలా సహజం. పార్టీలో తమ తమ ఆధిపత్యం చాటుకోవడంలో ప్రధానంగా గ్రూపులు మొలకెత్తుతాయి. ప్రజలకు సేవ చేయడానికి ఈ గ్రూపు విభేదాలు ఉపయోగపడితే చాలా బాగుంటుంది. అంతేతప్ప ప్రజల దృష్టిలో ఒకరి పరువు మరొకరు తీయడానికి ప్రయత్నిస్తూ రెండు గ్రూపులు నిరంతరం పనిచేస్తూ ఉంటే మొత్తంగా పార్టీనే నష్టపోతుంది.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఇప్పుడు అదే తరహా పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల మధ్య పరస్పర విభేదాలు పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తున్నాయి. ప్రజల దృష్టిలో ఎమ్మెల్యేకు ఉన్న పరువు తీయడానికి విశ్వసనీయతను దెబ్బతీయడానికి మరొక వర్గం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నది. ఏతావతా ప్రజల దృష్టిలో పార్టీ పరువు పలచన అవుతోంది.
నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మరొక నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య సుదీర్ఘ కాలంగా విభేదాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అవి శృతి మించి పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి. నంద్యాలలో ఇటీవల కానిస్టేబుల్ హత్య జరిగిన నేపథ్యంలో.. ఆ హత్యకు పాల్పడిన రౌడీ మూకలతో ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డికి దగ్గరి సంబంధాలు ఉన్నాయనేది ఆయన సొంత పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి ఆరోపణ! కాబట్టే జైల్లో ఉన్న సదరు రౌడీలను పరామర్శించడానికి ఎమ్మెల్యే వెళ్లారని రాజగోపాల్ రెడ్డి నింద వేస్తున్నారు.
అయితే తనకు వారితో సంబంధం లేదని, ఏ పాపం ఎరుగనని, నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని పదే పదే చెప్పుకుంటున్న ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి.. తాను రౌడీ మూకల పరామర్శకు జైలుకు వెళ్లినట్టుగా ఆధారాలు చూపిస్తే తక్షణం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాలు కూడా విసిరారు. సాధారణంగా పదవికి రాజీనామా లాంటి పెద్ద సవాళ్లు.. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలు శృతి మించినప్పుడు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ స్వపక్షంలోనే బురదజల్లే వారికి సమాధానంగా ఈ మాట చెప్పాల్సిన రావడం చిత్రం.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక నంద్యాలలో చాలా పెద్ద సంఖ్యలో మర్డర్లు జరుగుతున్నాయని.. ఆ రౌడీమూకలందరితో ఎమ్మెల్యేకు సంబంధాలు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఆయన మాటలు గుడ్డ కాల్చి మొహానవేసిన సామెత చందంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒక నింద వేసేస్తే చాలు, బురద చల్లేస్తే చాలు, దానిని కడుక్కోవడం అనేది అవతలి వ్యక్తికి సంబంధించిన తలనొప్పి అనే తీరుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. తాను ఆధారాలు చూపించినా సరే ఎమ్మెల్యే తన ప్రభావంతో అన్ని అబద్ధాలుగా నిరూపించగలరని రాజగోపాల్ రెడ్డి మాట. ఆధారాలే తనవద్ద లేనప్పుడు ఎవరైనా ఇలాంటి మాటలే చెప్తారని ప్రజలు అనుకుంటున్నారు.
ఆయన చేస్తున్న ఈ ఆరోపణ కేవలం నంద్యాలలో శిల్పా వారి పరువు తీసేది మాత్రమే కాదు. వైసిపి ఎమ్మెల్యేలు తమ తమ అధికార దర్పంతో తమ మీద వచ్చే అనేక ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయగలరని అర్థం వచ్చేలా ఈ విమర్శలు ఉన్నాయి. ఇలా ఇద్దరు కీలక నాయకులు రోడ్డున పడి కొట్టుకుంటూ ఉంటే.. పార్టీ నాయకత్వం చోద్యం చూస్తూ కూర్చుంటే కుదరదు. నాయకత్వం వారిద్దరితోనూ మాట్లాడి పరిస్థితి అదుపు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నష్టం తప్పదు!