తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నియోజకవర్గం కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కడప జిల్లాలో బలమైన అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప అసెంబ్లీ అభ్యర్థిపై చంద్రబాబు కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది.
ఇందులో భాగంగా కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా గొంగిరెడ్డి ఉమాదేవి (43)ని అనధికారికంగా ఎంపిక చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. దివంగత వైఎస్సార్ హవాలో కూడా కడప కార్పొరేషన్‌లో టీడీపీ తరపున రెండుమార్లు ఉమా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఉమా అంటే గెలుపు అభ్యర్థి అని చంద్రబాబు నమ్ముతున్నారు. కడప కార్పొరేషన్ పరిధిలోని అలంఖాన్‌పల్లె ఈమె స్వస్థలం. ఈమె మామ అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్‌గా పని చేశారు.
గతంలో లక్ష్మిరెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో టికెట్ చేజారింది. కడప అసెంబ్లీ పరిధిలో లక్ష్మిరెడ్డికి చెప్పుకోదగ్గ పలుకుబడి వుంది. వైసీపీ ముస్లిం మైనార్టీకి టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కడప నుంచి గెలిచిన అంజద్‌బాషా ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రి కూడా.
ఇదిలా వుండగా వైసీపీ కేవలం మైనార్టీలకే పెద్దపీఠ వేస్తోందని మిగిలిన సామాజిక వర్గాల్లో అసంతృప్తి వుంది. ఈ అసంతృప్తి, ప్రభుత్వంపై వ్యతిరేకత రానున్న ఎన్నికల్లో టీడీపీకి కలిసొస్తుందని చంద్రబాబు అంచనా. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కడప ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున కందుల శివానందరెడ్డి తర్వాత మరే హిందువు గెలుపొందలేదు. రానున్న ఎన్నికల్లో ఉమాదేవి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏమో గుర్రం ఎగరా వచ్చేమో!