గణాంకాలకు భిన్నంగా అబద్ధాల ప్రచారం!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అందుకోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా తయారే! సర్కారు బడులనుంచి విద్యార్థులు తరలి వెళ్ళిపోతున్నారని.. ప్రైవేటు పాఠశాలలు ఆశ్రయిస్తున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు సరిగా లేనందు వల్లనే ఇలా…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అందుకోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా తయారే! సర్కారు బడులనుంచి విద్యార్థులు తరలి వెళ్ళిపోతున్నారని.. ప్రైవేటు పాఠశాలలు ఆశ్రయిస్తున్నారని.. ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు సరిగా లేనందు వల్లనే ఇలా జరుగుతోందని.. అనేక రకాల అబద్ధాలు అనైతికంగా ప్రచారం చేయడానికి పచ్చ మీడియా తెగబడుతోంది. 

ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఈ విద్యా సంవత్సరంలో మూడున్నర లక్షలు తగ్గినట్టుగా ప్రచారం చేస్తోంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం అని చాటి చెప్పాలని వారి ఉత్సాహం! అయితే అదే కథనంలోనే గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఎలా ఉన్నదో గణాంకాలను కూడా వారు అందించారు. ఆ గణాంకాలు చెబుతున్న వాస్తవం వేరు. పచ్చ మీడియా చేస్తున్న విష ప్రచారం వేరు. వివరాల్లోకి వెళితే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్లో 2019 సంవత్సరం నాటికి మొత్తం విద్యార్థుల సంఖ్య 38,55,228 గా ఉంది. సరిగ్గాఅదే సమయంలో ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. విద్యా సంస్థలు దాదాపుగా రెండేళ్లపాటు మూతపడ్డాయి. బడులు లేకపోయినా సరే స్కూళ్లలో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండడం… అదే సమయంలో కరోనా దెబ్బకు ఆదాయ మార్గాలు కోల్పోవడంతో చాలామంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారారు. 

ఆ ప్రభావంగా 2020-21 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 43,95,214కు చేరుకుంది. అంటే సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులకు పైగా పెరిగారు. కరోనా కారణంగా చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. ఆ తర్వాతి విద్యా సంవత్సరం 2021- 22 గణాంకాలను పరిశీలిస్తే 44,29,356 మంది మొత్తం విద్యార్థులు ఉన్నారు. అంటే సంఖ్య మరింత పెరిగిందని అర్థం!

కరోనా వలన విద్యార్థులు రావడం కొంతవరకు ఉంటుంది కాదనలేం. అయితే అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మెరుగుపడటం.. నాడు నేడు పరిస్థితి కింద స్కూల్ లను అత్యద్భుతంగా తీర్చిదిద్దడం వంటి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాదనలేని సత్యాలు.

2022-23 విద్యా సంవత్సరం విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ స్కూల్లో సంఖ్య తగ్గింది. ఇప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య.. 40,74,322 గా ఉంది. ఇలా సంఖ్య తగ్గేసరికి పచ్చ మీడియా ప్రచారం ప్రారంభించారు. వారు చెబుతున్న గణాంకాల ప్రకారమే.. 2019-20 వాటి విద్యార్థుల సంఖ్య కంటే ఇప్పుడున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువ. 

కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పటికీ 2.2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో పెరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. నాడు నేడు స్కూళ్లల్లో మెరుగుదల కావచ్చు.. ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండడం కావచ్చు.. విద్యా ప్రమాణాలు మెరుగుపడటం కావచ్చు.. ఏదైనా సరే మొత్తానికి రెండు లక్షల పైచిలుకు మంది విద్యార్థులు పాఠశాలల్లో పెరిగిన మాట వాస్తవం. ఈ సత్యాన్ని దాచి పెడుతూ.. గత ఏడాదితో మాత్రం పోల్చి మూడున్నర లక్షల మంది విద్యార్థులు తగ్గారని నిందలు వేయడం నీచం.

స్కూళ్లకు రంగులు వేసి నాడు నేడు అని భ్రమపెడుతున్నారనే ఆరోపణలు ఘోరంగా ఉన్నాయి. నాడు నేడు కింద పనులు జరిగిన పాఠశాల రూపు రేఖలే సమూలంగా మారిపోయాయి. అద్భుతమైన వసతులు సమకూరాయి. అవి పట్టించుకోకుండా ఇలాంటి వ్యాఖ్య చేయడం పచ్చ మీడియాకు తగని పని. స్వయంగా వారు చూపిస్తున్న గణాంకాల సాక్ష్యం గానే.. కరోనా ముందు సంవత్సరానికి ప్రస్తుతానికి విద్యార్థుల సంఖ్య పెరిగారు. ఇప్పటికైనా విషప్రచారం చేయడం వారు మానుకుంటే బాగుంటుంది.