విశాఖ మహా నాగరం. ఒక విధంగా చెప్పాలీ అంటే మినీ ఇండియాగా కూడా అభివర్ణించాలి. పాతిక లక్షల మందికి పైగా భారీ జనాభా సిటీలో ఉంటారు. అలాంటి విశాఖలో ఈ మధ్య కాలంలో వరసగా హత్యలు జరుగుతున్నాయి. దాంతో విశాఖలో శాంతిభద్రతలు కరవు అయ్యాయని, హింసా రాజధానిగా మారిందని ఒక రేంజిలో ప్రచారం అయితే మొదలైంది.
విశాఖలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దానికి మీద విశాఖ పోలీస్ కమిషనర్ సీ హెచ్ శ్రీకాంత్ సవివరంగా విషయాలు చెప్పుకొచ్చారు. విశాఖలో హత్యలు జరిగిన మాట వాస్తవం. అయితే అవన్నీ కూడా కుటుంబ కలహాలు. అక్రమ సంబంధాలు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి జరిగినవే తప్ప వెనక ఎలాంటి కుట్ర కానీ గ్యాంగ్ వార్ కానీ రౌడీ షీటర్ల ప్రమేయం కానీ లేదని తేల్చేశారు.
దీని మీద కొంతమంది పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మద్యం మత్తులో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను కూడా శాంతిభద్రతల సమస్యతో ఎలా ముడిపెడతారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో రౌడీ షీటర్లను, గ్యాంగులను కఠినంగా అణచివేయడం వల్లనే నగరం మొత్తం ప్రశాంతంగా ఉందని, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులలో కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఆయన వివరించారు.
విశాఖలో ఏదో జరిగిపోతోందని హింసా రాజధాని అని ప్రచారం చేస్తున్న వారు ఏ రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారో అందరికీ తెలిసిందే అంటున్నారు. విశాఖ పాలనా రాజధాని అవుతుంది అని ముందే ఈ రకమైన దుష్ప్రచారం మొదలెట్టారని అంటున్నారు. ఇళ్ళలో జరిగే వివాదాలకు నగర భద్రతకు ముడిపెట్టి విమర్శలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.