ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొట్టిన దెబ్బతో అమరావతి ఉద్యమం గోవిందా అని చెప్పక తప్పదు. అమరావతే ఏకైక రాజధానిగా వుండాలనే డిమాండ్‌తో ఇటీవల అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలు పెట్టారు. ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగు పెట్టింది. పాదయాత్రను ఎల్లో మీడియా ఓ రేంజ్‌లో జాకీలు పెట్టి ఆకాశమే హద్దుగా చిత్రీకరిస్తోంది. అమరావతి పాదయాత్రలో పాల్గొంటున్న వారి అభిప్రాయాలు, వారి ఫొటోలతో మరో స్వాతంత్ర్య పోరాటం జరుగుతోందన్న రేంజ్‌లో ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే నిన్నటి వరకూ ఉన్న ఎన్టీఆర్ పేరు తొలగించడమే వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా ఎన్టీఆర్ చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ వ్యవహారంపైనే అన్ని చానళ్లు డిబేట్లు నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ వివాదంలో అమరావతి ఉద్యమం కాస్త కొట్టుకుపోయింది.
హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం, అలాగే డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడం సరైందా? కాదా? అనే విషయమై రచ్చ సాగుతోంది. ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం ఎలా సరైందో… జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పిన లాజిక్‌ను వైసీపీ గట్టిగా వినిపిస్తోంది. టీడీపీ హయాంలో వైద్య రంగానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, అలాంటప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఏంటని వైసీపీ నిలదీస్తోంది.
సుమారు రెండు నెలలపాటు అమరావతి పాదయాత్ర చేపట్టాలని పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాచరణ రూపొందించింది. జగన్ పన్నిన వ్యూహంలో టీడీపీ, అమరావతి ఉద్యమం గిలగిలా తన్నుకుంటున్నాయి. రాజధానిపై చర్చ పక్కకు పోయి, ఎన్టీఆర్ తెరపైకి రావడంతో వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అమరావతి ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి!