విధేయతకు తిరుగుబాటుకు మధ్య కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ పాపం ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సోనియా కుటుంబాన్ని కీర్తిస్తూ, సోనియా కుటుంబం పట్ల విధేయత ప్రకటిస్తూ, సోనియా కుటుంబ భజన చేసుకుంటూ.. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా మనగలుగుతున్న అతి విధేయులకు…

కాంగ్రెస్ పార్టీ పాపం ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సోనియా కుటుంబాన్ని కీర్తిస్తూ, సోనియా కుటుంబం పట్ల విధేయత ప్రకటిస్తూ, సోనియా కుటుంబ భజన చేసుకుంటూ.. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా మనగలుగుతున్న అతి విధేయులకు కాంగ్రెస్‌ను కేవలం సోనియా కుటుంబ ఆస్తిగా మాత్రమే కాకుండా ఒక పార్టీగా కూడా చూస్తున్న తిరుగుబాటు రాజకీయ నాయకులకు మధ్య ఇప్పుడు పోరాటం జరగబోతోంది. 

ఈ రెండు వర్గాల మధ్య పోరాటం సంగతి ఎలా ఉన్నప్పటికీ, మధ్యలో పార్టీ మీద తమ కుటుంబ పెత్తనం ఎక్కడ చేజారిపోతుందో అనే కంగారు సోనియా కుటుంబంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది! సోనియా కుటుంబం నుంచి పార్టీ పగ్గాలు మరొకరి చేతికి వెళ్లిపోతే తమ పప్పులు ఉడకవని దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ వృద్ధ సీనియర్ నాయకులు భయపడుతున్నారా? అనే అనుమానం కూడా కలుగుతుంది! ఇలాంటి రకరకాల సంక్లిష్టతల మధ్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అక్టోబర్ నెలలో తేలుతుంది!

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాలి. ఇరుసు విరిగిన చక్రాలు, నడ్డి విరిగిన గుర్రాలు.. పూన్చిన బండికి.. ఇప్పుడు ఒక రథసారధి కావాలి! కేవలం ఒక్క ఏడాది లేదా ఏడాదిన్నర వ్యవధి మాత్రమే ఉంది. ఈ కొత్త సారధి ఆ డొక్కు రథాన్ని ఫార్ములా వన్ రేస్ ట్రాక్ మీద పరుగులు తీయించాలి. విజయం సాధించాలి. స్వప్నంలోనైనా ఇది సాధ్యమేనా..? ఏమో కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకోసం కసరత్తు చేస్తున్నది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రక్రియ మొదలుపెట్టింది.
కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు కావాలంటూ అధినాయకత్వానికి తిరుగుబాటు లేఖ రాసిన 23 మంది సీనియర్ నాయకుల అభిప్రాయాలు ఇప్పటిదాకా పరిగణన లోకి రానేలేదు వారిలో చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు. 

కొందరు ఇంకా ఉన్నారు. వాళ్లు పార్టీని సంస్కరించాలని అనుకుంటున్నారు. గాడిలో పెట్టడానికి ఉత్సాహపడుతున్నారు. ఆ 23 మందిలో ఒకరైన, మాజీ కేంద్రమంత్రి శశిధరూర్ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ పడబోతున్నారు. తిరుగుబాటు నాయకులలో ఒకరైన శశిధరూర్ అధ్యక్ష ఎన్నిక విషయంలో కూడా తన సొంత గళాన్ని వినిపించారు. ఎన్నిక పారదర్శకంగా జరగాలనే మాట ఎత్తారు. అసలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసే వాళ్ళు ఎవరు తెలియాలని ఓటర్ల జాబితా ముందుగా బయటకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ డిమాండ్ ను గమనిస్తే ఇన్నాళ్లు అసలు ఓటర్ల జాబితా అనేది బహిరంగంగా ఎవ్వరికీ తెలియకుండానే ఎన్నికలు అనే నామమాత్రపు ప్రహసనం కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ వచ్చిందా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతా సోనియా కుటుంబం కనుసన్నల్లో మాత్రమే జరుగుతూ ఉన్న వ్యవహారాలు గనుక ఎవరు ఇలాంటి ప్రశ్న గతంలో లేవనెత్తి ఉండకపోవచ్చు. శశిధరూర్ ఓటర్ల జాబితా గురించి ప్రశ్నించడమే కాంగ్రెస్ పార్టీలో మారుతున్న వైఖరికి సోనియా కుటుంబాన్ని అతిక్రమించి అయినా పార్టీని కాపాడుకోవాలని కొందరి ఉద్దేశానికి నిదర్శనంగా మనం పరిగణించాలి.

అదే సమయంలో సోనియా కుటుంబానికి వీరవిధేయుల కేటగిరీ కింద అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉండబోతున్నారు. గతంలో ఏకపక్షంగా ఆయన చేతిలో పగ్గాలు పెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎన్నిక అనివార్యమైన పరిస్థితి!

వాతావరణం ఇలా ఉండగా.. భారత్ జోడో నినాదంతో దేశమంతా పాదయాత్ర సాగిస్తున్న రాహుల్ అధ్యక్ష పదవిపై కిమ్మనడం లేదు. అయితే సోనియా కుటుంబ వీరవిధేయులు మాత్రం ఆ స్థానంలోకి రాహుల్ రావాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల పిసిసి కమిటీలు రాహుల్ మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని ఆయన ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలని తీర్మానాలు చేసే పంపడం ఒక ప్రహసనం లాగా కనిపిస్తోంది.

చూడబోతే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించడానికి బరిలో ఉన్న నాయకులు ఇద్దరూ విధేయ తిరుగుబాటు వర్గాలకు చెందినవారు. నీవే తప్ప ఇతః పరంబెరుగ అని అందరూ మరోవైపు రాహుల్ ను కీర్తిస్తున్నారు. సోనియా మొగ్గు గహ్లోత్ వైపుంటుందని ప్రచారం జరిగింది. శశిథరూర్ పాదయాత్రలో రాహుల్ ను కలిసి, తాజాగా సోనియాను కలిసి అధ్యక్ష పదవికి పోటీపై తన ఆసక్తి వెలిబుచ్చారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కునారిల్లుతోంది. ఏ రకంగా ఆ పార్టీ భవిష్యత్ ప్రస్థానం సాగుతుందో వేచి చూడాలి.