తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్నిటికి మించి మన తెలుగు న్యాయకోవిదుడైన జస్టిస్ ఎన్వీ రమణ తన పెద్దరికాన్ని ప్రదర్శించారు. కృష్ణా జలాల వివాద అంశం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక సూచనలు చేశారు.
కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్.వి.రమణ రెండు తెలుగు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సూచించడం గమనార్హం. పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ, తెలంగాణ సీనియర్ న్యాయవాదులు తమతమ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా వాదించారు.
నదీ జలాలకు సంబంధించి బోర్డు పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెలిట్ విడుదల చేసిందని, కావున ఏపీ పిటిషన్పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని, ఈ లోపు నీటిని తెలంగాణ వాడుకునే అవకాశం ఉందని, వెంటనే గెజిట్ను అమలు చేయాలని ఏపీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ… కృష్ణా జలాల వివాదంపై గతంలో తనకు వాదించిన అనుభవాన్ని గుర్తు చేశారు. అందువల్ల మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు సూచించారు. కేంద్రం నుంచి అదనపు సూచనలు, సలహాలు కావాలంటే విచారణ వాయిదా వేసి మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని సీజేఐ చెప్పారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న జస్టిస్ ఎన్.వి.రమణ తేల్చి చెప్పడం గమనార్హం.
విచారణను బుధవారానికి వాయిదా వేశారు. సాగు, తాగు జలాలకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణకు లోతైన అవగాహన ఉంది. అందులోనూ ఆయన తెలుగు వ్యక్తి కావడంతో క్షేత్రస్థాయిలోని వాస్తవాలు తెలిసి ఉండడం వల్లే మధ్యవర్తిత్వం సమస్యను పరిష్కరించుకోవాలనే సూచన ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకునే అంశంలో సాధ్యాసాధ్యాలపై మున్ముందు మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.