ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. బాబు, లోకేష్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తున్నాయి, ఫ్యూచర్ సీఎం అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
తండ్రికొడుకులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తన రాజకీయ పునఃప్రవేశంపై తారక్ ఎక్కడా స్పందించలేదు. కనీసం పరోక్షంగా కూడా సంకేతాలు ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో పొలిటికల్ రీఎంట్రీపై ఎన్టీఆర్ కు ప్రశ్న ఎదురైంది. అది కూడా సామాన్య వ్యక్తి నుంచి కాదు, ఏకంగా రామ్ చరణ్ నుంచి.
రామ్ చరణ్ గెస్ట్ గా, ఎన్టీఆర్ హోస్ట్ గా ''ఎవరు మీలో కోటీశ్వరులు'' అనే కార్యక్రమానికి సంబందించి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ను ఎన్టీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటికి సమాధానాలు చెప్పే క్రమంలో రామ్ చరణ్ భారీ ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాడు. ఇదంతా లీకుల రూపంలో ఇప్పటికే బయటకు వచ్చేసింది.
కార్యక్రమంలో ఈ స్నేహితులిద్దరూ సరదాగా మాట్లాడుకునే క్రమంలో.. ఓ ప్రశ్నపై చర్చించుకుంటూ.. “నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నావంటగా..” అంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ను నవ్వుతూ ప్రశ్నించాడు. దీనిపై ఎన్టీఆర్ నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తన రాజకీయ ఎంట్రీపై చరణ్ కు కొంత స్పష్టత ఇచ్చాడు.
అయితే చరణ్ కు తారక్ ఏం చెప్పాడో తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు లేదు. ఎందుకంటే, ఎపిసోడ్ నుంచి దాన్ని కట్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత దాన్ని కట్ చేయాల్సిందిగా స్వయంగా ఎన్టీఆర్ యూనిట్ కు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.