ప్రత్తిపాటి పుల్లారావు…టీడీపీ పాలనలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ సీనియర్ నేత. చంద్రబాబు కేబినెట్లో మంత్రి. చంద్రబాబు సామాజిక వర్గం కావడంతో అదనపు బలం. పార్టీ పరాజయం కావడంతో ప్రత్తిపాటి పుల్లారావు పత్తా లేకుండా పోయారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తాయి.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హోదాలు అనుభవించి, ఆర్థికంగా చక్కదిద్దు కున్న ఇలాంటి వాళ్లు…. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం తమకెలాంటి సంబంధం లేదన్న రీతిలో వ్యవహరిస్తుండడంపై సహజంగా విమర్శలు వస్తున్నాయి.
పైగా అమరావతి భూకుంభకోణంలో ప్రత్తిపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రత్తిపాటి కుటుంబ సభ్యులు భారీగా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం వాదిస్తున్నట్టుగా ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే మాటకే అర్థం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రత్తిపాటి పుల్లారావులో ధైర్యం నింపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో ఆయన బాబు కేబినెట్లో సహచర సభ్యుడు దేవినేని ఉమా అరెస్ట్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. కొండపల్లిలో నిజాలను బయట పెట్టేందుకు వెళ్లిన దేవినేని ఉమను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొండపల్లిలో అక్రమాలు, అన్యాయాలు జరగలేదని ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు దేవినేని ఉమ పరిశీలనకు వెళితే అభ్యంతరం ఏంటని ప్రత్తిపాటి పుల్లారావు లాజిక్ తీశారు.
చిలకలూరిపేటలో రోజూ 500 లారీల మట్టి, ఇసుక తరలిపోతోందని ఆయన ఆరోపించారు. నిన్నమొన్నటి వరకూ తానెక్కడ ఉన్నాడో కనీసం పార్టీ శ్రేణులకు కూడా తెలియకుండా దాక్కున్న ప్రత్తిపాటి పుల్లారావు… ఒక్కసారిగా బయటికి రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పుతో కేసులకు భయపడాల్సిన పనిలేదనే ధైర్యంతోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.