టాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు ధీమాగా వున్నారు. థియేటర్లకు కొత్త రేట్లు సవరణ 'అతి త్వరలో' అని పూర్తి నమ్మకంతో వున్నారు. కొంత మంది నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఆంధ్రలో అధికారంలో వున్న వైకాపా నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిసి వచ్చిన తరువాత ఈ పరిస్థితి నెలకొంది.
దామోదర ప్రసాద్, భరత్ చౌదరి, ఒంగోలు బాబు తదితరులు సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిసి సుమారు అరగంటకు పైగా చర్చలు జరిపారు. బి సి సెంటర్ల రేట్లు సవరించడానికి సిఎమ్ జగన్ సుముఖంగా వున్నారని 'సజ్జల' ఈ బృందానికి తెలిపినట్లు బోగట్టా. అయితే అదనపు రేట్ల వ్యవహారం ఇప్పట్లో కాదని క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
టికెట్ రేట్ల సవరణకు సిఎమ్ జగన్ సుముఖంగా వున్నారని, త్వరలో ఈ మేరకు ఆదేశాలు వెలువడవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి టాలీవుడ్ బృందానికి వెల్లడించినట్లు తెలుస్తోంది.
దాంతో ఇప్పుడు ఆగస్టులో ఒకటి రెండు పెద్ద సినిమాల విడుదల మీద డిస్కషన్లు సాగుతున్నాయి. ఆగస్టు 20 లేదా 27న లవ్ స్టోరీ సినిమా వదిలితే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారు.
ఆగస్టు 14 వరకు వున్న నైట్ కర్ఫ్యూ ను 15 నుంచి సడిలిస్తే సెకెండ్ షో సమస్య కూడా తీరుతుంది. రేట్లు సవరించి, సెకెండ్ షో ఇస్తే ఇక సమస్యలు తీరినట్లే. యాభై శాతం ఆక్యుపెన్సీ అన్నది పెద్దగా సమస్య కాదు.