అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ మరోసారి పాదయాత్ర మొదలైంది. అమరావతి పాదయాత్ర నిర్వాహకులు వ్యూహాత్మకంగా దేవుడి సెంటిమెంట్‌ను తీసుకొస్తున్నారు. అలాగే పాదయాత్రలో ఎక్కువగా మహిళలు పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాదయాత్రకు దేశవిదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నట్టు ఎల్లో మీడియా రాతలున్నాయి. ఈ పాదయాత్రకు వైసీపీ మినహా పది ఓట్లు, ఒక్క సీటు కూడా లేని రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నాయి.
పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు చదువుతున్నాం. ఇక్కడో కీలక విషయాన్ని గమనించాల్సి వుంది.
రాజధాని ప్రాంతం ఎక్కువగా గుంటూరు జిల్లా పరిధిలో వుంది. దీంతో ఈ ఉద్యమానికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు గట్టి మద్దతుదారులుగా నిలిచి వుంటారని ఎవరైనా అనుకుంటారు. అదేం విచిత్రమో కానీ ఈ పాదయాత్ర ప్రారంభం మొదలు, రెండు రోజులైనా ఇప్పటి వరకూ టీడీపీ సీనియర్ నాయకుడు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ అసలు కనిపించడం లేదు.
మరోవైపు పాదయాత్రకు కర్మ, కర్మ, క్రియ టీడీపీ అని అందరికీ తెలిసిన విషయం. అలాంటిది రాజధాని ప్రాంతం నుంచి, అది కూడా టీడీపీ తరపున లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ పాదయాత్రకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది.
పాదయాత్రకే కాదు, టీడీపీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారనే చర్చకు తెరలేచింది. పారిశ్రామిక వేత్త అయిన గల్లా జయదేవ్ అధికార పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రచారానికి బలం కలిగించేలా గల్లా జయదేవ్ నడుచుకుంటున్నారని చెప్పొచ్చు. అమరావతి పాదయాత్రతో పాటు టీడీపీలో కొనసాగడంపై గల్లా మనసులో ఏముందనేది అంతు చిక్కడం లేదు.