అమరావతీనే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్‌తో రెండో దశ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర 60 రోజులు పాటు సాగి అరసవల్లిలో ముగియనుంది. ఈ పాదయాత్రపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘాటు విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రపై ఘాటుగా స్పందించారు. ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
అసలు అమరావతి పాదయాత్రలో రైతులున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు కొందరు దాన్ని రాజధానిగా ప్రకటించారన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నారన్నారు. విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న దండయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పి కొడతారని ఆయన హెచ్చరించారు.
వైసీపీ మంత్రులు, నాయకులు పదేపదే పాదయాత్రపై వార్నింగ్‌లు ఇస్తున్నారు. వీరి మాటలు వింటుంటే ఉత్తరాంధ్రలో అడుగు పెడితే అడ్డుకునే పరిస్థితులు ఎదురు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ ప్రాంతాన్నైతే ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిందో, అక్కడికే వద్దే వద్దని పాదయాత్ర చేపట్టడం ముమ్మాటికీ రెచ్చగొట్టే చర్యలే అని చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో పాదయాత్రలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.