బుధవారం ఉదయాన్నే ఓ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. జాగింగ్ కి వెళ్లిన జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఓ ఆటో ఢీ కొనడంతో ఆయన స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. సాయంత్రం వరకు ఇదే విషయాన్ని అందరూ నమ్మారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొంది అనే కోణంలో పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ చనిపోయింది ఓ జడ్జి కావడంతో మరింత లోతుగా ఎంక్వయిరీ జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్య అది. కానీ దుండగులు దాన్ని ఓ రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనుకున్నారు. చనిపోయింది జిల్లా జడ్జి కావడంతో పైనుంచి ప్రెజర్ వచ్చింది.
ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ, హైకోర్టు జస్టిస్ తో మాట్లాడి దీనిపై దృష్టిపెట్టాలన్నారు. దీంతో పోలీసులు పక్కాగా ఎంక్వయిరీ మొదలు పెట్టారు. సీసీ టీవీ ఫుటేజీ వెలికి తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అది ప్రమాదం కాదు, పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్య అని తేలింది.
ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ కోసం బయటకు వచ్చారు. ఇంటి నుంచి అర కిలోమీటర్ దూరం కూడా రాలేదు, అంతలోనే ఆటో వచ్చి ఢీకొంది. జడ్జి రోడ్డు పక్కనే వెళ్తున్నా.. ఆటో నేరుగా ఆయన్ని ఢీ కొనడానికే వచ్చినట్టు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. అంతకు ముందు రోజే ఆటోని దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు.
బెయిల్ వ్యవహారమే తేడా కొట్టిందా..?
జడ్జిని హత్య చేసేంత కక్ష ఎవరికుంటుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో జడ్జి ఆనంద్ ముందుకొచ్చిన కేసుల గురించి ఆరా తీశారు. ధన్ బాద్ లో మాఫియా హత్యల కేసులు ఆయన బెంచ్ ముందు ఉన్నాయి.
ఇటీవలే ఇద్దరు గ్యాంగ్ స్టర్లకు ఆయన బెయిలు నిరాకరించారు. దీంతో ఇది మాఫియా పనేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జడ్జిని హత్యచేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్న మాఫియా కుట్ర సీసీ కెమెరా ఫుటేజీతో అలా బయటపడింది.