విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తాజాగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించొద్దని ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. న్యాయస్థానం సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో మరింత దూకుడు ప్రదర్శించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అభ్యంతరం చెబుతూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఏపీ సమాజం ఆశ్చర్యపోయే అంశాలున్నాయి.
ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని కేంద్రం హితవు చెప్పడం గమనార్హం. అంతేకాదు, ప్రైవేటీకరణను సమర్థించుకునేందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని పొందుపరిచింది. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేయడంతో పాటు ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
వ్యాజ్యం దాఖలు చేసిన లక్ష్మీనారాయణకు రాజకీయ రంగు పులిమింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని అఫిడవిట్‌లో పేర్కొనడం విశేషం. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్ వేశారని కౌంటర్‌లో తేల్చి చెప్పింది. అసలు లక్ష్మీనారాయన పిల్‌కు విచారణ అర్హతే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం.
ఇంతటితో ఆగలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ లేదని పేర్కొంది. ఉద్యోగులను తొలగించవచ్చని కూడా కేంద్రం స్పష్టం చేస్తూ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనం కలిగిస్తోంది. ఏకంగా న్యాయస్థానంలో ప్రైవేటీకరణ ఆగదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల్లో ఆందోళన నెలకొంది.