అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ తో మహాపాదయాత్ర అనే కార్యక్రమం నిర్వహించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చేసింది. కానీ ఇది కేవలం అనుమతి ఇచ్చేయడంతో ముగిసిపోయే వ్యవహారం ఎంత మాత్రం కాదు. ఇదివరకటిలాగా ‘అమరావతి రైతులు’ అనే గొడుగు కింద ఉన్న ఆందోళనకారులు తిరుపతికి పాదయాత్ర చేయడం లేదు. ఈసారి వాళ్లు ఉత్తరాంధ్రలోని అరసవెల్లి దాకా మహా పాదయాత్ర చేయదలుచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రెచ్చగొట్టే చర్య.
ఆచరణాత్మకమైన సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో రాజధాని రాకుండా అదే ప్రాంతంలో అమరావతి నుంచి వెళుతున్న రైతులు పాదయాత్ర చేస్తుంటే శాంతి భద్రతలపరంగా పరిస్థితులు విషమించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కేవలం ఆ కారణాల చేతనే పోలీసులు ఈ యాత్రకు అనుమతులు నిరాకరించారు. అయితే ఇప్పుడు హైకోర్టు చెప్పిన తర్వాత వారికి తప్పదు. అందుకే ఈ యాత్రను శాంతియుతంగా ఘర్షణలు గానీ, అవాంఛనీయ సంఘటనలు గాని జరగకుండా పూర్తి చేయించడం ఎలాగా అనే దిశగా ఇప్పుడు ఏపీ పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
అమరావతి మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ గురించి విచారణ జరిపిన సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా ఉన్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును ఎలా కాదంటారు? అనేక రాష్ట్రాల మీదుగా భారత్ జోడోయాత్ర సాగుతూ ఉంటేనే దానికి అనుమతులు ఇచ్చారు.. ఢిల్లీలో వేల మంది ర్యాలీలు చేస్తుంటే అనుమతులు ఇస్తున్నారు అక్కడ శాంతిభద్రతలు కాపాడుగలుగుతున్నారు… అయితే 600 మంది రైతులు యాత్ర చేస్తాం అంటే మీరు అడ్డుకోవడం ఎలా సబబు అని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకులు వేల మందితో కలిసి ప్రదర్శనలు చేస్తుంటే మీరు అనుమతిస్తున్నారు కదా అంటూ కూడా పోలీసులను నిలదీసింది.
కానీ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చూసినప్పుడు ఆ యాత్రలు వేరు అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర వేరు. పైగా వారు చేయదలుచుకుంటున్న ప్రాంతం కూడా ఇక్కడ చాలా కీలకమైనది.
అదే అమరావతి రైతులు తిరుపతికి మహా పాదయాత్రగా వెళ్తామంటే అనుమతి ఇచ్చిన పోలీసులు అరసవిల్లికి వెళ్లడానికి మాత్రం ఎందుకు అనుమతి నిరాకరిస్తారు. ఈ అంశం వెనుక ఉన్న లాజిక్ ను కోర్టు పరిశీలించి ఉంటే బాగుండేది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉంటే ఈ అమరావతి రైతులందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంతవరకు ఓకే. తమ నిరసన ప్రదర్శన ద్వారా యాత్రల ద్వారా చేయగలిగినదంతా చేస్తున్నారు అంతవరకు ఓకే. అయితే విశాఖకు రాజధాని వస్తున్నదంటే విశాఖ తో పాటు యావత్ ఉత్తరాంధ్ర కూడా పండుగ చేసుకున్న సంగతిని ఈ సందర్భంగా మనం గమనించాలి.
తమ ప్రాంతం ఎప్పటికైనా బాగుపడుతుందని అభివృద్ధికి నోచుకుంటుందని ఉత్తరాంధ్రవాసులంతా మురిసిపోయారు. నిజానికి అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన ఉత్తరాంధ్ర వాసుల ఆశకు భంగకరం. అయినా సరే శాంతికాముకలైన ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఎన్నడూ అమరావతి ఉద్యమం జోలికి రాలేదు.
తీరా ఇప్పుడు అమరావతి రైతులే విశాఖ మీదుగా అరసవెల్లి వరకు మహా పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టడం కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి తద్వారా శాంతిభద్రతలను దెబ్బతీయడానికి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్చర్యం పాలు చేయడానికి మాత్రమే అనే అభిప్రాయం పలువురులో ఉంది.
కోర్టు తీర్పు చెప్పింది కనుక అనుమతులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడితే పోలీసులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమరావతి యాత్ర ఉత్తరాంధ్ర దిశగా ప్రారంభమైన నటించి ఆటంకాలు అవాంతరాలు ప్రతిఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నింటినీ చక్కదిద్దుతూ శాంతిభద్రతలను కాపాడడం పోలీసులకు విషమ పరీక్ష. అసలే ప్రభుత్వాన్నికూలంగా వ్యవహరిస్తున్నదని.. ప్రత్యర్థి పార్టీల నుంచి ఆరోపణలను ఎదుర్కొంటున్న పోలీసు శాఖ.. ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతుందో చూడాలి.