కొన్నాళ్ల కిందట వరకూ సీఎం పదవికి రాజీనామా చేయాలని తనను ఎవరూ కోరడం లేదని చెప్పిన కర్ణాటక ముఖ్యమంత్రి యూడియరప్ప ఇప్పుడు టోన్ మార్చారు. అధిష్టానం చెబితే వెంటనే రాజీనామా అని ఆయన పూర్తిగా సరెండర్ అయ్యారు. అయితే దాదాపు 78 యేళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి నుంచి అధిష్టానం చేత మర్యాదగా తొలగించబడుతున్న యడియూరప్ప రాజకీయంగా మాత్రం పగ్గాలను వదిలేయడానికి సుముఖంగా కనిపిస్తున్నట్టుగా లేరు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా పార్టీకి సేవలందిస్తానంటూ యడియూరప్ప ప్రకటనలు చేస్తూ ఉండటం గమనార్హం.
తనలో ఇంకా రాజకీయ చేవ ఉందని ఆయన ప్రకటించుకున్నారు. అది కూడా కనీసం 10, 15 సంవత్సరాల పాటు తను పార్టీకి సేవలందించగలనంటూ ఆయన ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని అధిష్టానం కోరితే అందుకు సమ్మతమే కానీ, పార్టీకి మాత్రం తన సేవలు కొనసాగుతాయని యడియూరప్ప అంటున్నారు. ఇదే ఆసక్తిదాయకమైన మెలిక అని చెప్పవచ్చు. యడియూరప్ప స్థానంలో మరొకరికి ఆ బాధ్యతలను అప్పగించి, ఆయనను కర్ణాటక రాజకీయంలోనే బీజేపీ అధిష్టానం ఉంచితే.. ఆ తర్వాత రచ్చ మొదలుకావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చేమో!
ఇప్పటికీ ప్రభుత్వంలో యడియూరప్ప మద్దతుదార్లు గట్టిగానే ఉన్నారు. ఆయన వర్గం ఎమ్మెల్యేలు అంటూ కొందరు మిగిలే ఉన్నారు. అధిష్టానం చెబుతోంది కాబట్టి వారు కొత్త ముఖ్యమంత్రికి మద్దతును ఇవ్వొచ్చేమో కానీ, యడియూరప్పకు వారు మద్దతుగానే ఉంటారు. అలాగే కొత్త ముఖ్యమంత్రి వస్తే, మంత్రి వర్గం కూడా చాలా వరకూ మారుతుంది. దీంతో.. సహజంగానే కొందరు అసంతృప్త వాదులు తయారు కావొచ్చు. అలాంటి వారు చిక్కితే యడియూరప్ప మళ్లీ తన గేమ్ ప్లాన్ ను మార్చొచ్చు. తిరిగి తనే శరణ్యం అని ముఖ్యమంత్రి పదవి మళ్లీ తనకే దక్కేలా యడియూరప్ప రాజకీయ వ్యూహాలను అమలు పెట్టగల సమర్థుడే!
వాస్తవానికి ఇప్పుడు కేంద్రంలో అధికారం చేతిలో లేకపోతే బీజేపీ హై కమాండ్ కు కూడా యడియూరప్పను పదవి నుంచి దించేంత సీన్ ఉండేది కాదు. గతంలో ఒకసారి ఇలా చేస్తేనే.. అప్పుడేమైందో అందరికీ తెలిసిందే. తనను పదవి నుంచి తొలగించిన అధిష్టానంపై పగబట్టి యడియూరప్ప కొత్త పార్టీని రెడీ చేశారు. నాటి ఎన్నికల్లో కమలం పార్టీని గట్టిగా దెబ్బ కొట్టారు యడియూరప్ప. ఇప్పుడు కూడా యడియూరప్పకు స్వకులం నుంచి గట్టి మద్దతు ఉంది.
లింగాయత్ స్వామీజీలంతా వెళ్లి యడియూరప్పను కలిసి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ ఒక తీర్మానాన్ని పెట్టి, ఆమోదించారట. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని, వారే వచ్చి తనను కలిశారంటూ యడియూరప్ప వివరణ ఇచ్చుకుంటున్నారు. సొంతకులంలో అయితే యడియూరప్పకు ఇప్పటికీ తగని ఆదరణ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, కర్ణాటక రాజకీయంలోనే బీజేపీ అధిష్టానం వదిలితే.. రాజకీయ రచ్చ మొదలుకావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
కొత్త ముఖ్యమంత్రిని యడియూరప్పే ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. అయితే ఈ విషయంలోనూ బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దించగానే.. యడియూరప్పను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వేసేసినా వేసేయగలరు. అప్పడు ఆయనకు గౌరవం ఇచ్చామంటూ చెప్పుకోవడానికి, ఆయనకు రాజకీయంగా బ్రేకులు వేయడానికి ఆ వ్యూహం సరిపోతుందేమో!