నా మాన‌సిక క్షోభ‌ను తెలియ‌జేసేందుకే లేఖః బ‌న్నీ వాసు

ఇంట‌ర్నెట్ స్వేచ్ఛ‌కు మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల గూగుల్ సీఈవో సుంద‌ర్‌పిచాయ్ వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌పై టాలీవుడ్ నిర్మాత బ‌న్నీ వాసు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు త‌న అభ్యంత‌రానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ గూగుల్…

ఇంట‌ర్నెట్ స్వేచ్ఛ‌కు మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల గూగుల్ సీఈవో సుంద‌ర్‌పిచాయ్ వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌పై టాలీవుడ్ నిర్మాత బ‌న్నీ వాసు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు త‌న అభ్యంత‌రానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌కు ఆయ‌న ఓ లేఖ రాశారు. ఈ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బాధ్య‌త లేని భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌, ఇంట‌ర్నెట్ స్వేచ్ఛ వ‌ల్ల తానెంత మాన‌సిక క్షోభ అనుభ‌వించానో తెలియ‌జేయ‌డం కోసం లేఖ రాస్తున్న‌ట్టు బ‌న్నీ వాసు వెల్ల‌డించారు.

ఇంటర్నెట్‌ స్వేచ్ఛ కారణంగా తనలాంటి ఎంతోమంది వ్యక్తులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతున్నాయని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాను వాడ‌డం మొదలుపెట్టిన రోజుల్లో త‌న ఆలోచనా విధానాలు, భావాలు పంచుకోవటానికి ఇది మంచి వేదిక అవుతుందని నమ్మిన‌ట్టు పేర్కొన్నారు. 

ఇదే సంద‌ర్భంగా భావప్రకటనా స్వేచ్ఛకి, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అవధులు ఉండకూడదని భావించిన వారిలో తాను కూడా ఉన్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కానీ.. గ‌త రెండేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో పరిస్థితులన్నీ తారుమారై తీవ్ర మాన‌సిక క్షోభ‌ను క‌లిగిస్తున్నాయ‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా కొన్ని ప్ర‌శ్న‌ల‌ను గూగుల్ సీఈవోకు బ‌న్నీ వాసు సంధించారు. ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల మాన‌సిక స్థితి, వారు సోష‌ల్ మీడియాను వినియోగిస్తున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డాన్ని ఆ ప్ర‌శ్న‌ల్లో గ‌మ‌నించొచ్చు. నెటిజ‌న్లంతా విచ‌క్ష‌ణ‌తో ఉంటున్నారా? విచక్షణ ఉన్న వాళ్లనే సామాజిక మాధ్యమాల్లోకి అనుమతిస్తున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

అలాగే అబద్ధాలు, అసత్యాలను పోస్టులు, వీడియోల రూపంలో పెట్టి ప్రజలను ఇబ్బందిపెడ్తున్న వాళ్లది తప్పా? లేదా అలాంటి వాళ్లు చేస్తున్న త‌ప్పుడు పనులను కంట్రోల్ చేయ‌కుండా ప్రపంచం ముందు పెడుతున్న సామాజిక మాధ్యమాలది తప్పా? అని బ‌న్నీ వాసు నిల‌దీశారు.

ఆవేద‌న‌తో కూడిన బ‌న్నీ వాసు ప్ర‌శ్న‌ల‌ను గ‌మ‌నిస్తే… ఆయ‌న‌పై అస‌త్య‌, అబ‌ద్ధాల‌తో కూడిన పోస్టుల‌ను పెట్టారేమో అనే సందేహాల‌ను నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఏ రంగంలోనూ మంచీచెడు ఉంటాయ‌ని, వాటిని వాడుకునే వాళ్ల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని నెటిజ‌న్లు బ‌న్నీ వాసుకు స‌మాధానాలిస్తున్నారు. ఫ‌లానా విష‌యంలో త‌న‌ను మాన‌సిక క్షోభ‌కు గురి చేశార‌ని ప్ర‌త్యేకంగా చెబితే బాగుంటుంద‌ని, త‌ప్పుడు పోస్టుల గురించి విస్మ‌రిస్తే స‌రిపోతుంద‌ని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.