అధికారుల తప్పులు.. ప్రభుత్వానికి తిప్పలు..!

గత ప్రభుత్వం టిడ్కో అపార్ట్ మెంట్ల పేరుతో జనాల్ని దారుణంగా మోసం చేసింది. నాసిరకం నిర్మాణాలతో పాటు, కాంట్రాక్ట్ కంపెనీలకు బకాయిలు పెట్టి మరీ దిగిపోయింది. ఆ పాప ప్రక్షాళన చేస్తూనే మరోవైపు అపార్ట్…

గత ప్రభుత్వం టిడ్కో అపార్ట్ మెంట్ల పేరుతో జనాల్ని దారుణంగా మోసం చేసింది. నాసిరకం నిర్మాణాలతో పాటు, కాంట్రాక్ట్ కంపెనీలకు బకాయిలు పెట్టి మరీ దిగిపోయింది. ఆ పాప ప్రక్షాళన చేస్తూనే మరోవైపు అపార్ట్ మెంట్లతో పనికాదంటూ.. సొంత ఇంటి స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చారు సీఎం జగన్. 

ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, నిర్మాణం కూడా పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే జగనన్న కాలనీలు అట్టహాసంగా మొదలయ్యాయి. మరి నిర్మాణాలు జోరందుకున్నాయా..? ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో జనం దేనివైపు మొగ్గుచూపారు, సంతోషంగా తమ కలల ఇంటిని కట్టుకుంటున్నారా..? అనేది అనుమానంగా మారింది.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు వాటి నిర్మాణ బాధ్యతను కూడా ప్రభుత్వమే భరించేందుకు ముందుకొచ్చింది. లబ్ధిదారులే ఇల్లుకట్టుకోడానికి ముందుకొస్తే ప్రభుత్వం దశలవారీగా లక్షా 80వేల రూపాయలు ఇస్తుంది. నిర్మాణ సామగ్రి ఇతర అవసరాలన్నిటినీ వారే తీర్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వం నిర్మాణ సామగ్రి అందించి, కూలీ ఖర్చులు భరిస్తే, లబ్ధిదారులే నిర్మించుకోవడం మరో పద్ధతి. మూడో ఆప్షన్ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది.

సహజంగానే లబ్ధిదారులంతా ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇచ్చే విధానానికి మొగ్గు చూపారు. తమపై భారం పడకుండా చూసుకున్నారు. అయితే ఇక్కడే అధికారులకు చిక్కొచ్చి పడింది. జగనన్న కాలనీల్లో అక్కడక్కడ కట్టిన నమూనా ఇళ్లకు 3లక్షలకు పైగానే ఖర్చయిందని సమాచారం. ఇప్పుడు కట్టబోయే ఇళ్లకు కూడా అంతే అవుతుంది. మరి ప్రభుత్వం ఇస్తామన్న లక్షా 80వేలు ఏ మూలకొస్తాయి.

ఇల్లు కట్టించి ఇవ్వడం అధికారులకు కుదరకపోయేసరికి క్షేత్ర స్థాయిలో మరో మెలిక పెట్టారు. దివ్యాంగులు, వితంతువులు, మరీ నిరుపేదలకు మాత్రమే కట్టించి ఇస్తామంటున్నారు. మిగతా వారంతా ప్రభుత్వం ఇచ్చే లక్షా 80వేలు విడతల వారీగా తీసుకుని సొంతంగా కట్టుకోవాల్సిందేనని చెప్పేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15లక్షల 60వేల ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా వీటిలో 10లక్షల నిర్మాణాలు మొదలయ్యాయి. అయితే నిర్మాణ ఖర్చులు తడిసి మోపెడవుతుండే సరికి లబ్ధిదారులకు ఏంచేయాలో పాలుపోవడంలేదు. నిర్మాణం మొదలు పెట్టకపోతే స్థలాలు క్యాన్సిల్ అవుతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అప్పులు చేసి మరీ బేస్ మెంట్ లెవల్ కి చేరుస్తున్నారు. ఆ తర్వాత దిగాలు పడుతున్నారు.

ప్రభుత్వం తెచ్చిన పథకం లబ్ధిదారులకు అనుకూలంగా ఉండాలి కానీ, వారిని కష్టాల్లోకి నెట్టేయకూడదు. ఇళ్లు కట్టించి ఇస్తామని ఓవైపు సీఎం జగన్ చెబుతున్నా.. అధికారులు మాత్రం అది సాధ్యం కాదనే ఉద్దేశంతో లబ్ధిదారులతోనే బలవంతంగా నిర్మాణాలు మొదలు పెట్టిస్తున్నారు. అధికారుల తప్పులన్నీ ఇప్పుడు లబ్ధిదారులకు తిప్పలుగా మారాయి. 

ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయితేనే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. ఒకవేళ ఇల్లు కట్టుకోలేక పేదలు అప్పులపాలైతే మాత్రం.. స్థలాలు ఇచ్చి, నిర్మాణ ఖర్చులో రాయితీ ఇచ్చినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.

ఇకనైనా స్థానిక నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే పరిస్థితులు చక్కబడతాయి. క్షేత్ర స్థాయిలో జరిగే వ్యవహారాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగలిగితే ఫలితం ఉంటుంది.