కడప జిల్లా పులివెందుల నియోజక వర్గంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దిక్కే లేకుండా పోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ రోజురోజుకూ బలహీనపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసేవాళ్లే కరువయ్యారు.
ఎంత సేపూ విజయవాడలో కూచొని పులివెందుల రాజకీయాలను ప్రత్యర్థులు విమర్శించడమే తప్ప, స్థానికంగా కార్యకర్తలకు భరోసా కరువైంది. వైఎస్ కుటుంబంపై మొదటి నుంచి పోరాడుతున్న ఎస్వీ సతీష్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవిని …సీఎం నియోజకవర్గంతో పాటు పొరుగునే ఉన్న జమ్మలమడుగుకు కూడా ఇన్చార్జ్గా అధిష్టానం నిర్ణయించింది. ఇదంతా కేవలం చెప్పుకునేందుకే తప్ప… పార్టీ బలోపేతం చేసే చర్య కాదనే అభిప్రాయాలు సొంత పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నాయి.
బీటెక్ రవి సింహాద్రిపురం మండలంలోని సొంత గ్రామ పంచాయతీ కసనూరులో తన మనిషిని సర్పంచ్‌గా గెలిపించుకోలేని దుస్థితి. ఇక పులివెందుల నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన ఏ విధంగా ప్రభావం చూపుతారో అర్థం చేసుకోవచ్చు. నియోజక వర్గంలో టీడీపీ తరపున అంతోఇంతో మాట్లాడుతున్న నేత భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి …ప్రస్తుతం సైలెంట్ అయ్యారు.
గతంలో టీడీపీ హయాంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ శిబిరం నిర్దేశకుడిగా భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. ఇప్పుడు రాంగోపాల్‌రెడ్డి మాటే లేకుండా పోయింది. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పులివెందుల నియోజక వర్గంలో టీడీపీ నేతలు చల్లగా జారుకున్నారు.
తమ సొంత పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ దఫా మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే… అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఆ పార్టీ నేతలు మౌనాన్ని ఆశ్రయించారు.