టోక్యో ఒలింపిక్స్ ఆరంభంలోనే భారత బృందం ఖాతా తెరిచింది. భారత్ కు అచ్చొచ్చిన స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఒకటైన వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయ్ చానూ రజత పతకాన్ని పొందారు. తద్వారా ఈ సారి ఒలింపిక్స్ లో భారత్ తరఫున తొలి మెడల్ ను పొందారు మీరా. గత ఒలింపిక్స్ లో ఇండియా తరఫున పేలవమైన ప్రదర్శన జరిగింది. రెండంటే రెండే మెడల్స్ అప్పుడు సాధించారు భారత అథ్లెట్లు. అయితే ఈ సారి ఆరంభంలోనే రజతం ద్వారా భారత్ ఖాతా తెరిచింది.
వెయిట్ లిఫ్టింగ్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించారు మీరా. ఇప్పుడు ఒలింపిక్స్ లో రజత పతకం ద్వారా ఆమె కొత్త రికార్డును సృష్టించారు. గతంలో తెలుగు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి పతకాన్ని సాధించారు. బహుశా ఆ తర్వాత ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు దక్కిన పతకం ఇదే.
మొత్తానికి రజతంతో ఖాతా తెరవడం శుభసూచకం. పతకాల పట్టికలో ఇండియాకు ఆదిలోనే స్థానం దక్కింది. ఇప్పటి వరకూ చైనా తొలి స్థానంలో ఉంది. తొలి రెండు స్వర్ణాలనూ చైనా తన ఖాతాలోకి వేసుకుంది.
ఇక భారత్ కు సంబంధించి ఇతర ఈవెంట్లలో కూడా కొన్ని సానుకూల ఫలితాలు లభించాయి. హాకీలో టీమిండియా తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ మీద విజయం సాధించింది. టేబుల్ టెన్నిస్ లో మనికా బాత్రా తొలి మ్యాచ్ లో విజయం సాధించి, రెండో రౌండ్ లోకి ఎంటరయ్యాయి. అయితే పలు విభాగాల్లో కొందరు భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. భారత్ కు పతకాల మీద ఆశలెక్కువగా ఉన్న బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు ఇంకా ప్రారంభం కానున్నాయి.